ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా 9,700 వైద్య పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికే ఈ ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అతి త్వరలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. బోధనాస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసేందుకు డాక్టర్ల నుంచి స్టాఫ్ నర్సుల వరకు 9,700 పోస్టులను భర్తీ చేయనున్నారు. 
 
గత పదేళ్లుగా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నియామకం గురించి ఆసక్తి చూపించలేదు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడం కోసం ఎన్నో చర్యలు చేపట్టింది. 15 కొత్త వైద్య కళాశాలలకు ఆమోదం తెలపడంతో పాటు ఆస్పత్రి భవనాల నిర్మాణం మరియు నూతన భవనాల నిర్మాణం లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. 
 
ప్రభుత్వం ఎంపికైన వైద్యులను మూడు సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ లో ఉంచనుంది. ఆ తరువాత వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయనుంది. కొత్తగా ఎంపికయ్యే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ కు అనుమతి లేదని ప్రభుత్వం నియమ నిబంధనలు విధించింది. కొత్తగా ఎంపికైన వారికి 15 శాతం నాన్ ప్రాక్టీసింగ్ ఆలవెన్స్ కింద ప్రభుత్వం ఇవ్వనుంది. ఎంపికైన వారు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు గిరిజన ప్రాంతాల్లో పని చేయాలి. 
 
ప్రభుత్వం డెంటల్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులను మాత్రం కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేయనుంది. ప్రస్తుతం వైద్య విద్యా శాఖలో 263 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా 492 పోస్టులు భర్తీ కానున్నాయి. వైద్య విధాన పరిషత్ లో, ప్రజారోగ్య శాఖలో 718 పోస్టులు భర్తీ కానున్నాయి. స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, మిగతా అన్ని పోస్టులు 7,792 ఉన్నాయని... ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: