తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఏడు రోజుల వయసున్న నవజాత శిశువు కరోనా భారీన పడి మృతి చెందింది. మూడు రోజుల క్రితం పాపలో కరోనా లక్షణాలు కనిపించడంతో పాప తల్లిదండ్రులు కరోనా పరీక్షలు చేయించారు. 
 
నిన్న రాత్రి పాప మృతి చెందగా... పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. నిలోఫర్ ఆస్పత్రిలో ప్రసవం జరగగా.... ప్రసవానికి ముందు చేసిన పరీక్షల్లో తల్లికి కరోనా నెగిటివ్ వచ్చింది. పాప కుటుంబ సభ్యులలో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఆస్పత్రిలోనే పాపకు కరోనా సోకి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చిన్నారి ఉండే ఏరియాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. 
 
ఆరోగ్య శాఖ గత కొన్ని రోజుల నుంచి జన సంచారం పెరగడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అభిప్రాయపడింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కొరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో నిన్న 71 కరోనా కేసులు నమోదు కాగా కరోనా బాధితుల సంఖ్య 1991కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 57 మంది మృతి చెందారు. 
 
రాష్ట్రంలో 1284 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సమావేశం జరగనుంది. మంత్రులు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశం తరువాత సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈరోజు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగింపు గురించి కూడా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.                    

మరింత సమాచారం తెలుసుకోండి: