తెలంగాణ ప్రభుత్వం ఈ నెల కూడా 4వేల కోట్ల అప్పు తీసుకుంది. కిందటి నెలతో పోల్చుకుంటే ఈ నెల ఆదాయం అంతో ఇంతో మెరుగ్గా ఉన్నా.. ప్రభుత్వం బాండ్ల వేలానికి వెళ్ళింది. రుణమాఫీ, రైతు బంధు నిధుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల పూర్తి జీతం ఇవ్వొచ్చని టాక్ వినిపిస్తుంది. 

 

కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఆదాయం పడిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం, ఆచితూచి అడుగులేస్తుంది. రోజువారీ ఖర్చులు, జీతభత్యాలు, ఫించన్లు, ఇతరత్రా సంక్షేమ పథకాల అమలు కోసం నెలకు  మినిమం పదివేల కోట్లు కావాలి...అయితే ప్రభుత్వానికి ఆ మేరకు ఆదాయం రావడం లేదు.  

 

కరోన కష్ట కాలంలో కేంద్రం ఆదుకుంటుందని అనుకున్నా అది లేదు.  లాక్ డౌన్ తో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. ప్రభుత్వం నడవాలంటే పైసలు కావాల్సిందే. దీంతో ప్రభుత్వం అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కేంద్రం నుండి  పన్నుల వాటా కింద 14 వందల కోట్లు రావాల్సి ఉంది. కానీ, ఏప్రిల్ లో 982 కోట్లు, మే నెలలో కూడా 982 కోట్లు విడుదల చేసి.. చేతులు దులుపుకుంది.  


 
అయితే లాక్ డౌన్ రిలాక్సేషన్ వల్ల ఏప్రిల్ తో పోల్చుకుంటే మే నెలలో ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చింది.  ఏప్రిల్ మొత్తం లాక్ డౌన్ తో డ్రై ఉంటే.. మే నెలలో 6 నుండి ఆర్థిక పరమైన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్ రిజిస్ట్రేషన్ లు ప్రారంభం అయ్యాయి.  పెట్రోల్,డీజిల్ వాడకం కూడా పెరిగింది. మద్యం ద్వారా ప్రభుత్వానికి 2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పెట్రోల్ పైన కూడా ఒక మొస్తరుగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ల పై 175 కోట్ల వరకు రావొచ్చని ఓ అంచనా ఉంది. 

 

ప్రభుత్వానికి ఈ నెల అంతో ఇంతో ఆదాయం ఉన్నా,  కిందటి నెల లాగానే ఈ నెల కూడా నాలుగు వేల కోట్ల అప్పు తీసుకుంది. ఈ డబ్బులను రుణమాఫీ, రైతుబంధు కోసం తీసుకుందని భోగట్టా. ఈ నెల సమకూరే కొంత ఆదాయంతో పాటు కొత్తగా తీసుకున్న రెండువేల కోట్ల అప్పు తో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వొచ్చనే తెలుస్తుంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: