గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీకి సంబంధించిన వివాదాల గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. టీటీడీ 50 ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశాయి. భక్తుల్లో కూడా టీటీడీ నిర్ణయంపై వ్యతిరేకత నెలకొంది. అయితే రెండు రోజుల క్రితం జగన్ సర్కార్ వేలం నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా టీటీడీని మరో వివాదం చుట్టుముడుతోంది. 
 
టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమల శ్రీవారి ఆస్తులు, ఆభరణాలపై ఆడిట్‌ జరగాలని.... సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు, ఆభరణాల ఆదాయం, ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్‌ జరపాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి తన డిమాండ్లను బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి ట్వీట్ చేశారు. రమణ దీక్షితులు చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 
 
ఆస్తుల వేలం ప్రక్రియ వివాదం ప్రభుత్వ ప్రకటనతో సద్దుమణుగుతున్న సమయంలో రమణ దీక్షితులు జగన్ సర్కార్ టార్గెట్ గా చేస్తున్న వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల వెంకన్న లడ్డూల అమ్మకాన్ని తప్పుబట్టిన రమణ దీక్షితులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. సీఎం జగన్ కు కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారని... జగన్ జోక్యం చేసుకోకపోతే టీటీడీ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం ఉందని అన్నారు. 


 
గతంలో ఒకసారి ఆడిట్ జరిగినా అప్పటికే కొన్ని ఆస్తులు మిస్ అయ్యాయని వార్తలు వినిపించాయి. భూముల విషయంలో కూడా గతంలో అనేక వివాదాలు నడిచాయి. వ్యవస్థలోని కొన్ని లోపాల వల్ల స్వామి వారి ఆస్తులకు సంబంధించిన అనేక వివాదాలు నెలకొంటున్నాయి. రమణ దీక్షితులు సీఎం జగన్ ను కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడంతో జగన్ రమణ దీక్షితుల వ్యాఖ్యల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: