చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఘోరంగా ఓడిపోయి సంవత్సరం అయింది. ఎన్నో దశాబ్దాల చరిత్ర గల టీడీపీ...జగన్ దెబ్బకు చరిత్రలో లేని విధంగా 23 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. అయితే ఇంత ఘోర ఓటమి ఎదురైన చంద్రబాబు తీరు మారినట్లు కనిపించడం లేదు. మళ్ళీ ఎలాగైనా అధికార పీఠం ఎక్కేయాలనే ఉద్దేశంతో, జగన్ సీఎం పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఆయనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

 

ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోలేదు. అసలు ఓటమికి కారణాలు ఏంటి, తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పులు జరిగాయనే విషయంపై అసలు చర్చించలేదు. ఎంతసేపు తమ హయాంలో చాలా గొప్పగా చేశామని డప్పు కొట్టుకుంటూనే, కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్ధం కావడం లేదని, ఇప్పుడు జగన్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు ఆ విధంగా ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోకపోవడం వల్ల, ఇప్పటికీ టీడీపీ పుంజుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయిపోయింది.

 

తాజాగా కూడా మహానాడు కార్యక్రమంలో కూడా జగన్‌పై విమర్శలు చేయడమే చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎంట్రీ ఇచ్చి, బాబుకు చురకలు అంటించారు. ఓటమిపై మహానాడులో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని, చంద్రబాబుకు అధికార కాంక్ష తప్ప రాష్ట్రంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అలాగే ప్రభుత్వాన్ని విమర్శించి లబ్ధిపొందాలన్నదే చంద్రబాబు తాపత్రయమని అన్నారు. అంబటి చెప్పిన వ్యాఖ్యలు కరెక్ట్ అని స్పష్టంగా తెలుస్తోంది.

 

ఇక అంబటి మరో హైలైట్ అయ్యే మాట ఒకటి చెప్పారు. చంద్రబాబు పాలనలో టీడీపీ శ్రేణులకే సంక్షేమ పథకాలు అందాయని, కానీ జగన్ పాలనలో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా.. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. నూటికి నూరు శాతం అంబటి చెప్పిన మాట కరెక్ట్. బాబు హయాంలో టీడీపీ శ్రేణులకే పథకాలు అందాయి. పైగా ఏ పథకం కూడా పూర్తిగా అమలు కాలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో అందరికీ పథకాలు అందుతున్నాయి..సమయానికి పథకాలు అమలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: