మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పార్టీలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని మరిచిపోవాలని కోరారు. పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని... పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకుంటానని తెలిపారు. పార్టీ యంత్రాంగాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తానని తెలిపారు. 
 
నిన్న మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి జూమ్ వెబినార్ ద్వారా టీడీపీ నిర్వహించిన మహానాడు ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. గత సంవత్సరం చాలా బాధాకరమైనదని... ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని... ఈ సంవత్సరం ఎదుర్కొన్న సమస్యలు గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రంలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం చెప్పే లెక్కలు వాస్తవ విరుద్ధం అని తెలిపారు. జగన్ రాష్ట్రంలో కరోనాను తక్కువ చేసి చూపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కరోనాను కట్టడి చేసేదని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేతకానితనం వల్లే పీపీఏల అంశం వివాదంగా తయారైందని తెలిపారు. టీటీడీ ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చెసిసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 
 
పంటను అమ్ముకోలేక సంవత్సర కాలంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... ప్రభుత్వం రైతుల్లోనూ కుల ప్రస్తావన తెచ్చిందని వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు సొంత రాజ్యాంగం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని... జగన్ ఇలాగే ప్రవర్తిస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పోలవరంలో 25,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చిందని... పోలవరం గురించి ప్రభుత్వం ఏం విచారణలు చేసిందో చెప్పాలని అన్నారు.  చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: