తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మహానాడు జరుగుతోంది. కరోనా కారణంగా జూమ్ యాప్ ద్వారానే చంద్రబాబు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. అయితే ఈ మహానాడు వేళలోనే జగన్ సర్కారు ఏడాది పాలన పూర్తయింది. అందుకే మహానాడును జగన్ సర్కారుపై విమర్శలకు కేటాయించేశారు చంద్రబాబు. పార్టీ ప్రక్షాళన వంటి విషయాలపై ఫోకస్ చేయకుండా జగన్ సర్కారును తిట్టేందుకే నేతలు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు.

 

 

ఇక చంద్రబాబు ఈ విషయంలో అందరికంటే ముందే ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ది జంగిల్ రాజ్ అంటూ ఘాటుగా మండిపడ్డారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రజావేదికను కూల్చివేసిన జగన్ సర్కారు.. తాజాగా మూడు లాంతర్ల స్తంభాల వరకు అనేక కూల్చివేతలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా దివాలా తీసిందన్నారు చంద్రబాబు.

 

 

రైతులకు చెప్పిన విధంగా 12500 ఇవ్వలేదని, 7500 రూపాయలే ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. భూముల్లో, గనుల్లో దోపిడీలకు పాల్పడ్డారు. సింహాచలం భూములపై కన్నేశారు. రాజమండ్రిలో ఆవ భూముల్లో అవినీతి చేశారు. కరోనా వల్ల ఎన్నికలు ఆపేస్తే...ఎన్నికల అధికారిని తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు.

 

 

కరోనా కాలంలో పింఛనర్లు, ఉద్యోగులకు జీతాల్లో 50శాతం కోత విధించారని.. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం వేలకోట్ల బిల్లులు చెల్లించారని చంద్రబాబు విమర్శించారు. రాజధాని తరలింపు అంశంపై సెలక్ట్‌ కమిటీ వేయమన్నందుకు శాసనమండలి రద్దు తీర్మానం చేస్తారా? చైర్మన్‌ చెప్పింది మండలి కార్యదర్శి చేయరా ? అంటూ మండిపడ్డారు. అయితే అసలు మహానాడు తెలుగుదేశం పార్టీ కోసం అన్న విషయం మాత్రం చంద్రబాబు మర్చిపోయినట్టున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: