కరోనా కష్టకాలం.. జర్నలిస్టుల పాలిట శాపంగా తయారైంది. మీడియాలో చాలా మంది గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారు. చిన్నాచితకా పత్రికలే కాదు.. బడా పత్రికలు కూడా ఉద్యోగులను పీకేస్తున్నారు. ఇక ప‌ని చేస్తున్నవారిలో స‌గం జీతం ఇస్తామ‌నే మాట‌లు కొంద‌రికి ఓదార్పు. త‌మ‌కు ఆ మాత్రం ప‌ని కూడా లేదే అని బాధ‌, ఆరాటం... మ‌రి కొంద‌రిలో. ఈ స‌గం జీతం ఈ ఏడాదంతా ఉన్నా ఆశ్చర్యపోవ‌ల‌సిన ప‌రిస్థితులు.

 

 

క‌రోనా కాలంలో జ‌ర్నలిస్టు మిత్రులలోనూ ఎడ‌తెగ‌ని ఆందోళ‌న‌. దిగులు మేఘాలు కమ్ముకున్న ముఖాల‌కు ఏవో న‌వ్వులు పూస్తారే గానీ లోలోప‌ల సుడి తిరిగే దుఃఖం క‌న‌లుతూనే ఉంటుంది. న‌మ్ముకున్న అక్షరం అన్నం పెట్టద‌ని తెలిసినా పాత్రికేయుల రొద వినిపించే వేదిక‌లు ఉండ‌వు. నింద మోప‌లేరు, ఫిర్యాదు చేయ‌లేరు. త‌మ గురించి తాము చెప్పుకోలేని ఉద్యోగ‌వ‌ర్గం ఏదైనా ఉందంటే అది జ‌ర్నలిస్టుల స‌మూహ‌మే.

 

 

ఈ దేశంలో అత్యంత బ‌ల‌హీన‌మైన సంఘాలు ఏవైనా వున్నాయంటే అవి జ‌ర్నలిస్టు సంఘాలే. క‌రోనా కాలంలో అభ‌ద్రత తీరుతెన్నులు మ‌రింత‌గా మ‌రింత మంది అనుభ‌వంలోకి వ‌చ్చాయి. చేదు వాస్తవాల వెక్కిరింత‌లో ఒక‌రికొక‌రు ఫోన్లలో వ‌ల‌పోసుకోడ‌మే త‌ప్ప ఎవ‌రికీ ఏ భ‌రోసా క‌నిపించ‌దు. క‌రోనా కాలాన కొంద‌రికి కొన్ని నెల‌ల పాటు స‌గం జీతాలే. ఇంకొంద‌రు ఉన్న ఉద్యోగాల నుంచి నిష్ర్కమించ‌వ‌లసిన స్థితి.

 

 

ఉద్యోగుల లోంచి తొల‌గించ‌వ‌ద్దనే వార్తలే కాదు సంపాదకీయాలు కూడా రాస్తాయి ప‌త్రిక‌లు. కానీ త‌మ వ‌ద్ద ఉన్నవారిని ఉద్యోగాల నుంచి పంపించే తంత్రం గురించి యోచిస్తారు. ఆ విష‌యం తెలిసినా కిమ్మన‌లేని వారు ఎంద‌రో. ఈ సమయంలో జర్నలిస్టులకు కావ‌ల‌సింది ఆర్థిక స‌హాయం. బ్యాంకు ఎకౌంట్ నెంబ‌ర్ తీసుకొని వారికి కొంత మొత్తం డ‌బ్బును బ‌దిలీ చేయాలి. ఈ ప‌ని ఎవ‌రు చేస్తారు? ఎవ‌రు చేయాలి? క‌నీసం జ‌న‌వ‌రి 2020 నుంచి ఇప్పటివ‌ర‌కు ఉపాధి కోల్పోయిన జ‌ర్నలిస్టుల‌కు తోడ్పడ‌టం అధికారంలో ఉన్నవారి విధి, బాధ్యత‌.

 

 

జ‌ర్నలిస్టు సంఘాల వారు, మీడియా అకాడ‌మీ, ఇత‌ర సంస్థల వారు ఈర‌క‌మ‌యిన ప‌ని చేయ‌వ‌చ్చు క‌దా. ఎందుకీ ఆలోచ‌న రాదు. వ‌చ్చినా స్పందించే చొర‌వ ఎందుకు చూప‌రు? ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలను అడ‌గ‌లేరు, క‌నీసం ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేయ‌కూడ‌దు. ఏదేమైనా అమాయ‌కంగా అక్షరాల‌ను న‌మ్ముకున్న జ‌ర్నలిస్టుల‌కు ఇది గ‌డ్డుకాలం.

 

- గుడిపాటి , సీనియర్ జర్నలిస్టు, పాలపిట్ట మాస పత్రిక సంపాదకులు

మరింత సమాచారం తెలుసుకోండి: