ఒక నాయకుడు, అందులోనూ ఒక పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి..? ప్రతి విషయం పైన అవగాహన ఉండడంతో పాటు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందనే విషయంపై పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి. అలాగే అధికార పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది ? ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ? ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందా లేదా ఇలా అన్ని విషయాల పైన అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పార్టీగా జనసేనను మార్చడంతో పాటు అధికారం చేపట్టాలనే ఆశతో ఉన్న పవన్ కళ్యాణ్ వంటి వారు మరింత అప్రమత్తంగా ఉంటూ రాజకీయాల్లోనూ, ప్రజల్లోనూ పట్టు పెంచుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విధంగా ముందుకు వెళ్లలేకపోవడంతో రాజకీయంగా వెనుకబడి పోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా అర్చకులకు, పాస్టర్లకు, ఇమామ్ లకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 


ప్రభుత్వం నుంచి ఆ ప్రకటన వెలువడిన తర్వాత ఆ విషయం పత్రికల్లోనూ, న్యూస్ ఛానళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం అయిన తర్వాత తాపీగా ఇదే విషయంపై స్పందించారు పవన్. అర్చకులను ప్రభుత్వం ఆదుకోవాలని, లాక్ డౌన్ కారణంగా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటన వెలువడిన తర్వాత మళ్లీ దానిపైన డిమాండ్ చేయడం పవన్ అభాసుపాలయ్యేలా చేసింది. ఆయన చేసిన ప్రకటనపై వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందిస్తూ ... అయిపోయిన పెళ్ళికి పవన్ బ్యాండ్ వాయిస్తున్నారని ఆయన వెటకారం చేశారు. కోట్లాది మంది అభిమానులు, ఒక రాజకీయ పార్టీ అధినేత అయిన పవన్ ఒక విషయంపై ఎటువంటి కసరత్తు చేయకుండా స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన అభాసుపాలు అయ్యేలా చేసింది. 


తాను వేలాది పుస్తకాలు చదివాను అని, ఎప్పుడూ చదువుతూనే ఉంటాను అని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు పవన్. దీనిపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. పవన్ చదవాల్సింది పుస్తకాలు కాదని, పత్రికలు చదవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుని ఆ తర్వాత స్పందిస్తే మంచిది అని వారు సూచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది గడిచిపోయింది. ఇంకా నాలుగేళ్ళ సమయం మాత్రమే ఉంది. అయినా పవన్ తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వంపై ఈ విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం పవన్ కళ్యాణ్ స్థాయిని చులకన చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: