కరోనా టైమ్ లో రాజ్య విస్తరణ కాంక్షకు పదును పెడుతోంది చైనా. స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ఉన్న హాంకాంగ్ ను పూర్తిగా బీజింగ్ కంట్రోల్లోకి తీసుకోవడానికి ఎత్తులేస్తోంది. తమ కంపెనీలను స్టాక్ ఎక్సేంజీల నుంచి అమెరికా డీలిస్ట్ చేయడంతో.. దీనికి విరుగుడుగా హాంకాంగ్ ద్వారా చైనా కంపెనీల్ని బ్రిటన్ స్టాక్ ఎక్సేంజీల్లో నమోదు చేయించాలని వ్యూహం రచిస్తోంది. పనిలోపనిగా కంట్లో నలుసులా ఉన్న హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి సవాలును కూడా పరిష్కరించాలని డ్రాగన్ తలపోస్తోంది. 

 

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు మొదట్నుంచీ దుందుడుకు తనం ఎక్కువే. చైనా ఎప్పుడూ తన ఆధీనంలో ఉన్న భూభాగంతో సంతృప్తి పడిన దాఖలాల్లేవు. 1997లో బ్రిటన్ నుంచి హాంకాంగ్ ను తీసుకున్నప్పుడు.. స్వయం ప్రతిపత్తి హామీ ఇచ్చిన చైనా.. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కడానికి రెడీ అయింది. వాస్తవానికి హాంకాంగ్ కు 2047 వరకూ స్వయంప్రతిపత్తి ఉంది. కానీ ఏడాది క్రితమే చానా ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కొత్త చట్టం తెచ్చేలా హాంకాంగ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. నేరగాళ్ల అప్పగింత చట్టానికి నిరసనగా హాంకాంగ్ లో నెలల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. ఓ దశలో హాంకాంగ్ అధ్యక్షురాలు కూడా రాజీనామాకు సిద్ధపడాల్సి వచ్చింది. చివరకు ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ప్రకటనలు ఇచ్చినా చైనా.. ఇప్పుడు అంతకు మించిన గుదిబండను హాంకాంగ్ కోసం సిద్ధం చేసింది.

 

హాంకాంగ్ లో నేరం చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తే.. వాళ్లను చైనాకు అప్పగించడమే ఈ నేరగాళ్ల అప్పగింత చట్టం ముఖ్యోద్దేశం. అయితే ఇక్కడ నేరం చేసిన వాళ్లని ఇక్కడే శిక్షించాలని హాంకాంగ్ వాసులు కోరారు. అయితే వారు చైనాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని, అందుకే ఈ చట్టం తెచ్చామని చైనా కహానీలు చెప్పింది. వాస్తవానికి హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థపై డ్రాగన్ కళ్లు పడ్డాయి. హాంకాంగ్  ఎకానమీ, బిజినెస్ హబ్ గా ఉంది. అమెరికా, యూరప్ దేశాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలు హాంకాంగ్ లో ఉన్నాయి. వీటి కారణంగా హాంకాంగ్ కు ఫుల్లుగా ఆదాయం వస్తోంది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ కూడా ఫుల్ జోష్ లో ఉంది. వీటన్నింటిపై కన్నేసే చైనా హాంకాంగ్ ను కబళించడానికి వ్యూహాలు రెడీ చేస్తోంది. 

 

గతం సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు కరోనా టైమ్ లో హాంకాంగ్ స్వాధీనానికి చైనా ప్రయత్నించడం వెనుక బలమైన కారణమే ఉంది. కరోనా వైరస్ కు చైనా కారణమని నిందిస్తున్న అమెరికా.. అక్కడి స్టాక్ మార్కెట్లలో చైనా కంపెనీల్ని డీలిస్ట చేసింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదుపుకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి విరుగుడుగా చైనా కంపెనీల్ని బ్రిటన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని డ్రాగన్ ఎత్తు వేసింది. దీనికి హాంకాంగ్ ను పావుగా వాడాలని ఫిక్సైంది. అక్కడ స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వం ఉంటే ఆటలు సాగవు కాబట్టి.. జాతీయ భద్రతా చట్టాన్ని చైనా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాంకాంగ్ లో చైనా న్యాయవ్యవస్థ, భద్రతా వ్యవస్థ ఏర్పాటవుతాయి. దీనిపై హాంకాంగ్ ప్రజలు తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు. అటు అమెరికా, యూరప్ దేశాలు కూడా డ్రాగన్ కుయుక్తులపై ఆందోళన చెందుతున్నాయి. హాంకాంగ్ లో ఉన్న తమ కంపెనీల పెట్టుబడులకు నష్టమని భావిస్తున్నాయి. అందుకే అమెరికా కూడా హాంకాంగ్ జోలికొస్తే సహించేది లేదని, కఠిన చర్యకు సిద్ధమేనని చైనాకు వార్నింగ్ ఇస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: