ఏపీ ఉద్యోగులకు శుభవార్త. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయి జీతాలు ఇవ్వాలని జగన్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఆదిశగా కసరత్తు మొదలైంది. ఆమేరకు నిధులు సమకూర్చుకునేందుకు ఆర్ధికశాఖ ప్రయత్నాలు చేస్తోంది. 

 

ఏపీలో ప్రతినెలా ఉద్యోగుల జీతాల కోసం  5వేల 500 కోట్లు వెచ్చిస్తుంది ప్రభుత్వం. అయితే లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావంతో ఆదాయం పడిపోయింది. దీనివల్ల రెండు నెలల పాటు జీతాల్లో కోతలు విధించక తప్పలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది సర్కార్. దీంతో  రెండు నెలలతో పోల్చుకుంటే కొంతవరకు  ఆదాయం పెరిగింది. ఈ క్రమంలో జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.

 

ఇవ్వాల్సిన జీతాల లెక్కెంత..? వస్తోన్న ఆదాయం ఎంత..? అనే అంశాలను బేరీజు వేస్తూ... పూర్తి స్థాయిలో జీతాల చెల్లింపులకు కావాల్సిన నిధులను మరో మార్గంలోనైనా సమకూర్చుకునే ప్రయత్నం చేయాలా..? అనే దిశగా ఆలోచన చేస్తోంది ఆర్థిక శాఖ. వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం సుమారుగా 16 వందల కోట్ల నుంచి 17 వందల కోట్ల మేర  ఉన్నట్టు సమాచారం. అలాగే ఎక్సైజ్‌ శాఖ నుంచి కూడా రోజుకు 50 కోట్ల వరకూ వస్తుందని లెక్క కడుతున్నారు. వీటితో పాటు మిగిలిన అన్ని శాఖల ఆదాయాన్ని చూస్తే రాష్ట్రానికి 3 వేల 200 నుంచి 3 వేల 400 కోట్ల రూపాయలు రానుంది. ఇక మొత్తంగా చూసినా  సుమారు 15 వేల కోట్ల రూపాయల మేర ఆదాయం నెలకు రావాల్సి ఉంటే.. అది నాలుగు వేల కోట్లకు పడిపోయిందనే చెప్పాలి. 

 

ఈ క్రమంలో జీతాల చెల్లింపుల్లో ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తినా... కేంద్రం నుంచే వచ్చే నిధులతో పాటు, ఇతర మార్గాల నుంచి కూడా సమకూర్చుకుని జీతాలు కావాల్సిన 5వేల 500 కోట్లు సమీకరించుకునే పనిలో పడింది ఆర్థిక శాఖ. సీఎం ఆదేశాల మేరకు ఆ దిశగా కసరత్తు సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: