దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరో మూడు రోజుల్లో నాలుగో విడత లాక్ డౌన్ ముగియనుండటంతో కేంద్రం మరోసారి లాక్ డౌన్ పొడిగించడానికి సిద్ధమవుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
ఢిల్లీ అధికార వర్గాల్లో లాక్ డౌన్ 5.0 గురించి భారీ చర్చ జరుగుతోంది. మోదీ సర్కార్ మే 31 తరువాత మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో గత వారం రోజుల నుంచి ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాని మోదీ మే 31వ తేదీన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదో విడత లాక్ డౌన్ లో కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 
 
దేశంలోని 11 ప్రధాన నగరాల్లో 70 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ముంబైతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణే, థానే, జైపూర్, సూరత్, ఇండోర్‌ లలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడంతో ఈ నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం అన్ని రకాల కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 
 
ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో దర్శనానికి తిరిగి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం జూన్ 1 నుంచి షాపింగ్ మాల్స్, థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. ఐదో విడత లాక్ డౌన్ లో జాతరలు, పండుగలు, సామూహిక ప్రార్థనలకు మాత్రం కేంద్రం అనుమతించకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాత్రం లాక్‌డౌన్ పొడిగింపు వార్తలను తోసిపుచ్చటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: