భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ పదో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 4వేల 500మంది కరోనా కాటుకు బలయ్యారు. మహారాష్ట్రలో కరోనా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, తమిళనాడునూ వైరస్ వణికిస్తోంది. 

 

భారత దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజూ 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో  కొత్తగా 6 వేల 566 కేసులు, 194మరణాలు రికార్డయ్యాయి‌. దేశంలో ఒకేరోజు 194 మంది మరణించడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షా 58 వేల 333కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 4 వేల 531 మంది వైరస్‌ కాటుకు బలయ్యారు. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 67వేల 692 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 86 వేల 110 యాక్టివ్‌ కేసులున్నాయ్‌. 

 

మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. ఒక్కరోజే కొత్తగా 2వేల 190 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి‌. కొత్తగా 105 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 56 వేల 948కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 18వందల 97మందిని కరోనా బలి తీసుకుంది. తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు వైరస్‌ తీవ్రత పెరుగుతోంది. తమిళనాడులో 18 వేల 545 కేసులు రికార్డవ్వగా.. 133 మంది చనిపోయారు. ఢిల్లీలో 15 వేల 257 మంది బాధితులున్నారు.

 

కరోనా వైరస్‌ వ్యాప్తి గుజరాత్‌లో వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో గుజరాత్‌లో కొత్తగా 374 మందికి కరోనా సోకడంతో..  మొత్తం కేసుల సంఖ్య 15 వేలు దాటింది. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 70 శాతంపైగా అహ్మదాబాద్‌ జిల్లాలోనే నమోదవ్వడం అక్కడ వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. రోజుకు 24 మంది చొప్పున గత వారం రోజుల్లో 169 మంది కరోనాతో చనిపోయారు. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి నిష్పత్తి మెరుగ్గా ఉంది. భారత్‌లో రికవరీ రేటు 42.45 శాతంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: