మహానాడు కార్యక్రమం మరోసారి జగన్‌పై విమర్శలు చేయడానికి వేదిక అయింది. చంద్రబాబు సహ టీడీపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా జగన్‌ని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి  పట్టించుకోకుండా, జగన్‌ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు..తన నోటికి పని చెప్పారు. దొరికిందో ఛాన్స్ అన్నట్లుగా రెచ్చిపోయి, జగన్‌పై తిట్ల దండకం అందుకున్నారు.

 

అసమర్థడు, దొంగ, జైల్లో ఉండి 16 నెలలు చిప్పకూడు తిన్నటువంటి సీఎం జగన్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఇంకా జైలు బుద్ధులు పోలేదని, ఏడాది పాలనలో అరాచకం, హింసా, విధ్వంసాలు చెలరేగిపోయాయని ఆరోపించారు. వేధింపులు, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు హద్దు అదుపులేకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీలు జరుగుతున్నాయన్నారు.

 

అయితే గత ఐదేళ్లు అధికారంలో ఉండగా టీడీపీ నేతలు ఇలాగే ఇష్టారాజ్యంగా జగన్‌పై విమర్శలు చేశారు. మాటకు మెదిలితే 16 నెలలు జైల్లో ఉన్నారని, శుక్రవారం రోజు కోర్టుకు వెళ్తారని మాట్లాడారు. అసెంబ్లీలో గానీ, మీడియా సమావేశాల్లో గానీ జగన్‌పై విపరీతమైన విమర్శలు చేశారు. అలాగే విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి దాడిపై కూడా హేళన చేస్తూ మాట్లాడారు. అలా టీడీపీ నేతలు ఎంత హేళన చేసి మాట్లాడినా..జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజల్లో ఉంటూ వచ్చారు.

 

అలా టీడీపీ నేతలు మాట్లాడటమే జగన్‌కు ప్లస్ అయింది. ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు భారీగా సీట్లు కట్టబెట్టి, టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. ఘోరంగా ఓడిపోయినా సరే టీడీపీ నేతలు మారలేదు. అదేవిధంగా మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. బాబు మెప్పు కోసమని చెప్పి, జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఇలా చేయడం వల్ల మళ్ళీ టీడీపీకే నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: