పాకిస్థాన్ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు గాలివాటం ప్రకారం పయనిస్తే తెలంగాణ లో అడుగుపెట్టే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు . ఇప్పటికే ఉత్తరాది రాష్ర్టాల్లో రైతాంగాన్ని తీవ్ర ఇక్కట్లపాలు చేస్తోన్న ఈ మిడతల దండు తెలంగాణలో ప్రవేశిస్తే , త్వరలోనే ప్రారంభం కానున్న ఖరీఫ్ పంట రైతాంగం చేతికి అందే అవకాశాలు ఎంతమాత్రం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు . మిడతల దండు రాష్ర్టంలోకి ప్రవేశిస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ర్త ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది .

 

ప్రగతిభవన్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అధికారులు , శాస్త్రవేత్తలు , ఇతర ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు .   మిడతల దండు రాష్ర్టంలో ప్రవేశిస్తే సంహరించే బాధ్యతలను ఐదుమంది సభ్యులతో  ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి  రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది . శుక్రవారం నుంచి ఈ కమిటీ సభ్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం లో బస చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షించనున్నారు . ప్రస్తుతం మిడతల దండు మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ లో ఉన్నాయని , అవి పంజాబ్ రాష్ర్టం వైపు పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు .

 

ఒకవేళ రాష్ర్టంలోకి ప్రవేశిస్తే వాటిని సంహరించడానికి హెలికాఫ్టర్లు , ఫైరింజన్లు , జెట్టింగ్ మిషన్లు , ఫెస్టిసైడ్స్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు పహారా కాస్తున్నట్లు రాష్ర్త ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . అదే సమయం లో ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు . లక్షలాది మిడతల దండు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే పంటపై దాడి చేస్తూ రైతాంగాన్ని వణికిస్తోంది . మిడతల దండును ఇలాగే వదిలితే, పంట నష్టం  దుర్భిక్షం తప్పదని ఇతర దేశాల్లోని పరిణామాలు రుజువు చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: