కాళేశ్వరం ప్రాజెక్టులో రేపు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఐదు జిల్లాల ప్రజ‌ల‌ చిర‌కాల స్వప్నం సాకారమవుతోంది. 205 కిలోమీట‌ర్లు ప్రయాణించిన గోదావరి జ‌లాలు... కొండపోచ‌మ్మకు జ‌లాభిషేకం చేయనున్నాయి. తెలంగాణ‌లోనే అతి ఎత్తైన ప్రాంతానికి గోదావ‌రి జలాలు చేరుకునే చారిత్రత ఘ‌ట్టానికి... చండీ, సుద‌ర్శన యాగాల‌తో రేపు తెల్లవారుజామున స్వాగ‌తం ప‌ల‌కనున్నారు... సీఎం కేసీఆర్. 

 

కాళేశ్వరం ప్రాజెక్టులో మ‌రో మైలురాయి. రంగ‌నాయ‌క సాగ‌ర్ జ‌లాశ‌యం నుంచి మూడు ద‌శ‌ల్లో ఎత్తి పోయ‌డం ద్వారా గోదావ‌రి జ‌లాలు కొండ‌పోచ‌మ్మకు చేరుకోనున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం  గ‌జ్వేల్‌లోని మ‌ర్కూర్-పాముల‌ప‌ర్తి గ్రామాల ద‌గ్గర 15 టీఎంసీల సామ‌ర్థ్యంతో కొండ‌పోచ‌మ్మ రిజ‌ర్వాయ‌ర్‌ను నిర్మించారు. సిద్ధిపేట జిల్లాలోని రంగ‌నాయ‌క‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ నుంచి 16 కిలోమీట‌ర్ల సొరంగం ద్వారా గోదవరి జలాలు తుక్కాపూర్ పంప్ హౌజ్ చేరుకుంటాయి. అక్కడి నుంచి అక్కారం పంజ్‌హౌస్‌కు, ఆ తర్వాత మ‌ర్కూర్ పంప్ హౌజ్‌కు చేరుకుంటాయి. అక్కడ... 34 మెగావాట్ల సామ‌ర్థ్యం ఉన్న ఆరు మోటార్లలో రెండింటిని సీఎం కేసీఆర్ స్విచ్‌ ఆన్ చేసి ప్రారంభించ‌నున్నారు. కొండ‌పోచ‌మ్మసాగర్‌... సిద్ధిపేట‌, సంగారెడ్డి, మెద‌క్, యాదాద్రి భువ‌నగిరి, మేడ్చల్ జిల్లాల‌ తాగు, సాగు నీటి అవ‌స‌రాల‌ను తీర్చనుంది.

 

ఇప్పటిదాకా కిందికి పరుగులు పెడుతున్న గోదావ‌రిని బీడు భూముల‌కు మ‌ళ్లించే భ‌గీర‌థ ప్రయ‌త్నమే ఈ ప్రాజెక్టులు. ల‌క్ష్మీ బ‌రాజ్ నుంచి తొమ్మిది అడుగులేసి... ప‌దో అడుగువేసే స‌న్నివేశ‌మే కొంచ‌పోచ‌మ్మ సాగ‌ర్. తొమ్మిది పంప్ హౌజ్‌ల ద్వారా 205 కిలోమీట‌ర్లు ప్రయాణించిన గోదావరి జలాలు... ప‌దో ద‌శ‌లో వంద మీట‌ర్ల నుంచి 618 మీట‌ర్లకు చేరుకుంటాయి. తుక్కాపూర్ పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోసిన జ‌లాలు మ‌ర్కూర్ పంప్ హౌజ్‌కు చేరుకుంటాయి. ఇక్కడ 34 మెగావాట్ల సామ‌ర్థ్యం ఉన్న ఆరు మోటార్ల ద్వారా 7,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. ఇలా ఎత్తిపోసిన జ‌లాలు కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్లోకి వ‌స్తాయి. ఈ జ‌లాశ‌యం నీటి నిల్వ సామ‌ర్థ్యం 15 టిఎంసీలు.

 

కాళేశ్వరం ప‌రిధిలో నిర్మించే అతి పెద్ద రిజ‌ర్వాయ‌ర్ మ‌ల్లన్నసాగ‌ర్ కాగా... అత్యధిక ఎత్తులో నిర్మించే రిజ‌ర్వాయ‌ర్ కొండ‌పోచ‌మ్మ. సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రాజెక్టును దేవాల‌యంగా భావించి దానికి అనుగుణంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశారు. చండీయాగం, సుద‌ర్శన‌ యాగం, గంగ‌మ్మ పూజ‌లు చేసి కొండ‌పోచ‌మ్మ ప్రాజెక్టును ఆరంభిస్తున్నారు. కొండ‌పోచ‌మ్మ ఆల‌యంలో చండీయాగం, పంప్ హౌజ్ ద‌గ్గర సుద‌ర్శన‌ యాగం చేస్తారు. చిన‌జీయ‌ర్ స్వామితో కలిసి కేసీఆర్... సుద‌ర్శన‌ యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. పంప్‌హౌజ్‌ను స్విచ్ఛాన్ చేస్తారు. కెనాల్‌కు నీళ్లు వ‌చ్చే డిశ్చార్జ్‌ పాయింట్ ద‌గ్గర గంగ‌మ్మకు స్వాగ‌తం ప‌లికి... పూజ‌లు నిర్వహిస్తారు. అతిథుల‌తో క‌లిసి కేసీఆర్ అక్కడే భోజ‌నం చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: