తెలంగాణ...ఆంధ్రప్రదేశ్‌ రైతులను మిడతల భయం వెంటాడుతోంది. మిడతల దండు ప్రవేశిస్తే పంట పొలాలను నాశనం చేస్తాయని తెగ భయపడుతున్నారు. రాష్ట్రంలోకి మిడతలు ఎంట్రీ ఇస్తే ఏం చేయాలనే దానిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏపీలో విశాఖ...అనంతపురం జిల్లాల రైతులు మిడతలొస్తున్నాయనే వార్తలతో వణికిపోతున్నారు. 

 

తెలుగు రాష్ట్రాల్లోకి మిడతలు దండెత్తుతాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలతో ఆంధ్రప్రదేశ్‌...తెలంగాణ రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగం  అప్రమత్తమవుతోంది. మహారాష్ట్రలోకి మిడతల దండు ప్రవేశించడంతో తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. హైదరాబాద్‌లో మిడతల దండు అంశంపై సీఎం  కేసీఆర్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలోకి మిడతల దండు ప్రవేశిస్తే ఏం చేయాలనేదానిపై చర్చలు జరిపారు. ఇప్పటికే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. మిడతలు కనిపిస్తే ఫోన్ చేయాలని టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. 

 

మరోవైపు...మిడతల రాకపై ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఆందోళన వ్యక్తమౌతుంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోకి మిడతలు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో కర్షకుల్లో హైరానా మొదలైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట్ర మంత్రి  ఇంద్రకరణ్  రెడ్డి జిల్లా అధికారుల‌తో ఫోన్లో మాట్లాడారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. మిడతల దాడి పొంచి ఉన్నందున తెలంగాణ ప్ర‌భుత్వం అన్నివిధాలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంద‌ని తెలిపారు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి. 

 

 రాబోయే రెండు, మూడు రోజుల్లో మిడతల దండు మహరాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ నారయణ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థతో టచ్‌లో ఉన్నామని చెప్పారు. మిడతల దండు మహారాష్ట్ర నుంచి ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే అవకాశం ఉందన్నారు. జిల్లా స్థాయిలో ఒక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్ నారాయణ రెడ్డి. 

 

నిజామాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల రైతులకు మిడతల భయం పట్టుకుంది. పంట పొలాలపై దాడి చేస్తే భారీ నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మిడతల బారి నుంచి బయట పడటానికి గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించాల్సిన అవసరం  ఉందని కోరుతున్నారు రైతులు. 

 

ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగానికీ మిడతల టెన్షన్ పట్టుకుంది. విశాఖ జిల్లా కశింకోట మండలం గోకవాలిపాలెంలో మిడతలు కనిపించాయి. రైతులు ఇచ్చిన సమాచారంతో ఉద్యానవన అధికారులు మిడతలను పరిశీలించారు. మిడతలను ఫొటో తీసి జోద్‌పూర్‌కు పంపించారు అధికారులు. అయితే...వలస మిడతల దండుతో పోలిక లేదని తేల్చారు శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తల ప్రకటనతో విశాఖ జిల్లా రైతులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

 

అటు...అనంతపురం జిల్లా రాయదుర్గం దాసప్పరోడ్డులో మిడతలు కలకలం సృష్టించాయి. ఓ ఇంటి వద్ద రెండు జిల్లేడు చెట్లపై అలుముకున్నాయి మిడతలు. అనంతపురం రాయదుర్గంలో మిడతల సమూహంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. వలస వచ్చిన మిడతలంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి...రెండు తెలుగు రాష్ట్రాల రైతులు మిడతల వార్తలతో హైరానా పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: