కరోనా లాక్‌డౌన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే, ఇంతటి కష్టకాలంలో కూడా కొందరి ఆస్తులు అనూహ్యంగా పెరిగాయి. అదృష్టవంతులంటే వాళ్లే. కరోనా కష్టకాలం కూడా 25 మంది కోటీశ్వరులకు కలిసొచ్చింది.  గడిచిన రెండు నెలల్లోనే వాళ్ల సంపద 255 బిలియన్‌ డాలర్లు పైగా పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే... అక్షరాలా 19 లక్షల కోట్ల రూపాయల పైమాటే.

 

మార్చి 23 తర్వాత దశ తిరిగిన వాళ్లలో ఫేస్‌ బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. రెండు నెలల్లో ఫేస్‌బుక్‌ షేర్ల విలువ 60 శాతానికి పైగా పెరిగింది. ఈ నెల 22న ఫేస్‌బుక్‌ షేర్‌ ఆల్‌టైమ్‌ హై స్థాయిని తాకింది. చిన్న వ్యాపారుల కోసం డిజిటల్‌ స్టోర్లు తెరవాలన్న ఆలోచనలకు షేర్‌ హోల్డర్ల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో నాల్గో స్థానంలో ఉన్న జుకర్‌ బర్గ్‌ ఆస్తి విలువ 86.5 బిలియన్‌ డాలర్లు. ఏప్రిల్‌లో విడుదలైన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏడో స్థానంలో ఉన్ జుకర్‌బర్గ్‌... తాజా జాబితాలో ముగ్గుర్ని వెనక్కి నెట్టి నాల్గో స్థానానికి చేరుకోవడం విశేషం.


  
భారీగా లాభపడ్డ ధనవంతుల్లో రెండో స్థానంలో అమెజాన్‌ వ్యవస్థాపక సీఈఓ జెఫ్‌ బెజోస్‌ ఉన్నారు. కరోనా ఆంక్షల వల్ల  రిటైల్‌ షాపులు మూతపడడం మొదలైన దగ్గర్నుంచి ఈ-కామర్స్‌ దిగ్గజం లాభపడుతూ వచ్చింది. మార్చి 23 నుంచి  అమెజాన్‌ షేర్ల విలువ 29 శాతం పెరిగింది. దీంతో జెఫ్‌ బాజోస్‌ ఆస్తుల విలువ 26 శాతం పెరిగి... 146.9 బిలియన్‌  డాలర్లకు చేరింది.

 

కరోనా ఆంక్షల సమయంలో అనూహ్యంగా లాభపడిన వాళ్లలో పిండౌడూ వ్యవస్థపాపకుడు కోలిన్‌ జెన్‌ హువాంగ్‌ ఒకరు.  చైనాలో అలిబాబా తర్వాత రెండో అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌గా పిండౌడూకు గుర్తింపు ఉంది. తాము కొన్న  వస్తువుల్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పంచుకునేలా తయారు చేసిన సోషల్‌ షాపింగ్‌ మోడల్ ‌కు ప్రజల  నుంచి అనూహ్య స్పందన లభించింది.  దీంతో మార్చి 23 నుంచి ఇప్పటి వరకూ పిండౌడూ షేర్‌ ధర దాదాపు రెట్టింపైంది. ఫలితంగా 40 ఏళ్ల కోలిన్‌ జెన్‌ హువాంగ్‌ ఆస్తుల విలువ దాదాపు 18 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అంటే, మన కరెన్సీ  ప్రకారం 13 వేల కోట్ల రూపాయలకు పైమాటే. దీంతో చైనాలోని అపర కుబేరుల్లో మూడో స్థానానికి చేరుకున్నాడు కోలిన్‌ జెన్‌ హువాంగ్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: