సోషల్ మీడియా.. ఇప్పుడు సెల్ ఫోన్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక్క వేలి దూరంలో ఉన్న మీడియా ఇది. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా తమ మనసులో ఉన్నది తక్షణమే జనం మీదకు వదిలే అవకాశం వీటి ద్వారా అందివచ్చింది. అయితే ఈ సోషల్ మీడియా కారణంగా విద్వేషాలూ పెరుగుతున్నాయి. ఇక రాజకీయ పార్టీల అభిమానుల వీరంగం సోషల్ మీడియాలో మరీ శ్రుతిమించిపోతోంది.

 

 

అందుకే.. ఇప్పుడు వీటికి ముకుతాడు పడుతోంది. నిన్న మొన్నటి వరకూ వైసీపీ సర్కారుపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే రంగనాయకుమ్మ అనే ఓ వృద్ధరాలిపై అనూష అనే అమ్మాయిపై కేసులు పెట్టారు కూడా. అయితే ఇప్పుడు టీటీడీ పై ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయట. ఈ మేరకు టీటీడీ తన తాజా సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

 

 

అయితే శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. గత వారం రోజుల నుంచి టీటీడీ ఆస్తుల వేలం అంటూ కొన్ని మీడియా చానళ్లు, రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై, దేవస్థాన పాలక మండలిపై దుష్ప్రచారం చేశారని టీటీడీ భావిస్తోంది. అందుకే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. దేవుడి సేవలో ఉన్న పాలకమండలిపై మళ్లీ ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలంటే సమగ్ర విచారణ జరిపించాలని తీర్మానం చేశారు.

 

 

ఏ స్థాయి ఎంక్వైరీ అయినా వేసి కుట్ర నిగ్గుతేల్చాలని ప్రభుత్వాన్ని కోరబోతోందట. ఇలా జరిగే ఎంక్వయిరీలో కుట్ర పూరితంగా పోస్టులు పెట్టారని తేలితే తగిన చర్యలు తీసుకుంటారన్నమాట. అందుకే సోషల్‌ మీడియాతో జర జాగ్రత్త.. ఆవేశంలో ఏదో ఒక పోస్టు పెడితే ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక.. పోలీసుల చుట్టూ తిరగలేక చాలా ఇబ్బందిపడతారు సుమా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: