టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానములు.. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన దేవస్థానం ఇది. అందుకే భక్తులు సమర్పించిన సొమ్ముతో వారి కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. కేవలం తిరుమల, తిరుపతికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు కట్టిస్తోంది. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.

 

 

ఇప్పుడు ఆ జాబితాలోకి మరో మణికిరీటం చేరబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకు ఓ ప్రత్యేకమైన ఆసుపత్రిని నిర్మించబోతోంది. అవును.. ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నిలోఫర్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి ఉండేది. కానీ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పిల్లల ఆస్పత్రి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచన మేరకు ఇంతకు ముందే పద్మావతి ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది.

 

 

తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్, స్విమ్స్‌లో ఎక్కడ అవకాశం ఉంటే .. అక్కడ తక్షణమే చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభించాలని సీఎం జగన్ సూచించారు. అందుకు అనుగుణంగానే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే.. ఏపీలోని పసివాళ్ల ఆరోగ్యానికి భరోసా వస్తుంది. ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్తే.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన అనంతరం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

 

 

ఇందుకోసం ట్రయల్‌ కూడా వేయడం జరిగిందని, అధికారులు చేసిన ఏర్పాట్లకు కొన్ని మార్పులు సూచించామని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ ఏ విధంగా దర్శనం త్వరితగతిన కల్పించాలనే అంశంపై ఈ నెల 31 తరువాత నిబంధనలు సడలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని తప్పకుండా భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: