ఏపీ సీఎం జగన్ విశాఖను రాజధానిగా చేయదలచుకున్నారన్న సంగతి తెలిసిందే. కానీ శాసన మండలిలో మెజారిటీ లేకపోవడం కారణంగా ఆ బిల్లు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు ఎల్జీ పాలిమర్స్ వంటి గ్యాస్ ప్రమాదాల కారణంగా అసలు విశాఖ రాజధానిగా కరెక్టు ప్లేసేనా అన్న చర్చ కూడా మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రాజధాని మార్పు అన్న ఆయన స్వప్నం మాత్రం నెరవేరలేదు.

 

 

ఇలాంటి సమయంలో సీఎం జగన్ మరోసారి రాజధాని అంశంపై స్పందించారు. త్వరలోనే విశాఖ రాజధానిగా మారనుందని క్లారిటీ ఇచ్చేశారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని జగన్ మరోసారి తేల్చి చెప్పినట్టయింది. విశాఖ పరిపాలన రాజధానిగా మారనుందని... అక్కడ మెట్రో రైల్ కూడా రాబోతోందని.. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అభివృద్ధి చేయనున్నామని తేల్చి చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి టెండర్లు ప్రక్రియ పూర్తయిందని, జీఎంఆర్‌కు రీకాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు.

 

 

ఆయన ఇంకా విశాఖ గురించి ఏమన్నారంటే.. " ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఇటువంటి కోర్సులు అందించేలా విశాఖలో హై అండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలతో పోటీ పడాలన్నా.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావాలన్నా.. విశాఖపట్నం అనువైన స్థలం అంటూ విశాఖ గురించి తన ఆలోచనలను పంచుకున్నారు. అంటే ఇక రాజధాని మార్పు గురించి ఎలాంటి సందేహాలు ఎవరికీ అవసరం లేదన్నమాట.

 

 

అయితే విశాఖను రాజధానిగా చేయాలన్న జగన్ అభిలాష మాత్రం వేగంగా నెరవేరడం లేదు. ప్రస్తుతం రాజధాని బిల్లు మండలి వద్ద పెండింగులో ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందిందో లేదో తెలియదు. సెలెక్టు కమిటీ తన పని మొదలు పెట్టిన దాఖలాలు లేవు. మరోవైపు అసలు మండలినే రద్దు చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ రాజధానిగా ఎప్పుడవుతుందన్నది ఆలోచించాల్సిన అంశమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: