ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని చాలామంది చెబుతుంటారు. నమ్మిన మామను నట్టేట ముంచాడని అంటుంటారు. అయితే అదంతా పార్టీ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమమని చంద్రబాబు అభిమానులు చెబుతుంటారు. ఆ సంగతి ఎలా ఉన్నా.. చంద్రబాబుకు ఎన్టీఆర్ పై ఇంకా కక్ష, కోపం ఉన్నాయేమో అనిపిస్తోందంటున్నారు కొందరు విశ్లేషకులు.

 

 

అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటారా.. ఎందుకంటే.. మరోసారి మహానాడులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావుక భారత రత్న బిరుదు ఇవ్వాలని తీర్మానం చేశారు. అలా చేస్తే మంచిదే కదా.. అది అవమానించడం ఎలా అవుతుందంటారా.. అవును మరి.. ఇలా డిమాండ్ చేయడం ఎన్నోసారో బహుశా ఆ పార్టీ నాయకులకే తెలియదనుకుంటా.. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏంటి.. తన రాజకీయ జీవితంలోనే అత్యంత దుస్థితిలో ఉన్నాడాయన.

 

 

టీడీపీ చరిత్రలోనే మొదటిసారిగా కేవలం ముగ్గురు లోక్ సభ సభ్యులు మాత్రమే ఉన్న పార్టీగా తెలుగుదేశం కునారిల్లుతోంది. మరి తెలుగుదేశం జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ ను పెద్దగా పట్టించుకోకుండా... ఇప్పుడు ఇలా ప్రతి ఏటా మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న అంటూ షో చేయడం అసలైన ఎన్టీఆర్ అభిమానులు మనసు చివుక్కుమనేలా చేస్తోంది.

 

 

కనీసం 2014 తర్వాత మోడీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న తరవాతైనా చంద్రబాబు తలచుకుంటే.. ఎన్టీఆర్ కు భారత రత్న వచ్చి ఉండేదేమో. మోడీని గట్టిగా పట్టుబట్టి ఉంటే భారత రత్న ఇచ్చేవాడేనేమో కానీ.. అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. ఆ కాలమంతా వదిలేసి ఇప్పుడు ఏదో చేయాలి కాబట్టి ఓ తీర్మానం చేసి పడేయడం అంటే అది ఎన్టీఆర్ పేరును వాడుకోవడం.. ఎన్టీఆర్ ను అవమానించడం కాదా అంటున్నారు నిజమైన నందమూరి తారక రామారావు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: