ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. నవరత్నాలను అమలు చేస్తామని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఏడాదిలోపే 90 శాతం హామీలను నెరవేర్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పించారు. 
 
అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అందరికీ న్యాయం చేసిన జగన్ సర్కార్ మీ సేవా కేంద్రాల యాజమాన్యాలకు మాత్రం అన్యాయం చేశారనే కామెంట్లు ప్రజల నుంచి, మీ సేవా కేంద్రాల నిర్వాహకుల నుంచి వినిపిస్తున్నాయి. మీ సేవా కేంద్రాల నుంచి జగన్ సర్కార్ కు మరో కొత్త సమస్య ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మీ సేవా కార్యకలాపాల ద్వారా జరిగే సర్టిఫికెట్ల జారీని జగన్ సర్కార్ ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా మంజూరు చేస్తోంది. 
 
అయితే ఈ సర్టిఫికెట్ల జారీ గ్రామ సచివాలయాల ద్వారా చేయకూడదని గతంలోనే హైకోర్టు ప్రకటించింది. గతంలో మీసేవా కేంద్రాల నుంచి జగన్ సర్కార్ కు ఒక వినతి పత్రం అందింది. వారు గ్రామ సచివాలయాల్లో మీ సేవా కేంద్రాలను భాగం చేయాలని అలా చేస్తే ప్రస్తుతం ఇచ్చిన విధంగానే కమిషన్ ఇస్తే ఉచితంగా సేవలందిస్తామని.... లేదంటే ప్రతి నెల వేతనాలు ఇస్తూ తమను నియమించుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. 
 
ప్రభుత్వం ఆ వినతి పత్రంపై స్పందించలేదు. ప్రజలకు గ్రామ సచివాలయాల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తే తమ పరిస్థితి ఏమిటని మీ సేవా నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ స్పందించకపోతే కోర్టు ధిక్కార కేసు వేస్తామని చెబుతున్నారు. జగన్ సర్కార్ వీరి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుందా....? లేదా...? తెలియాల్సి ఉంది. మీసేవా కేంద్రాల నిర్వాహకులు కోర్టు దిక్కార కేసు వేస్తే మాత్రం జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: