దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజా రవాణాకు కొంత వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరచుకున్నాయి. కానీ మెట్రో రైళ్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రవాణా సదుపాయలు కరువై జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మెట్రో రైలు ఎప్పుడు పరుగులు తీస్తుందా అని ఎదురు చూస్తున్నారు జనం.

 

కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. దాదాపు నెలన్నర తర్వాత ఆంక్షల్ని సడలిస్తూ వచ్చింది కేంద్రం. దీంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో కార్యకలాపాలు ప్రారంభించాయి. అన్ని షాపులతో తెరచుకుంటున్నాయి. అయితే, హైదరాబాద్‌లో ప్రజా రవాణా అందుబాటులోకి రాకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారు జనం. ఇటు ఆర్టీసీ బస్సులు తిరగక, అటు మెట్రో సర్వీసులు నడవక అవస్తలు పడుతున్నారు.

 

జూన్ 1 నుంచి బస్సులతో పాటు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో రైళ్లను పట్టాలపై తీసుకొచ్చి గంటకు ఒక రైలు చొప్పన నడిపించాలనేది ప్రస్తుతం మెట్రో అధికారులు ఆలోచన. నెల రోజుల తరువాత ప్రతి అరగంటకు ఒక రైలు తిప్పాలని భావిస్తున్నారు. ప్రయాణీకులు నిలబడకుండా, సూచించిన సీట్లలో కూర్చునేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, ఏసీలను సగం వరకు తగ్గించి సహజ సిద్ధమైన గాలిని పీల్చుకునే విధంగా మెట్రో బోగీల్లో మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఫ్లాట్‌ఫామ్‌ పైకి రైలు వచ్చే ముందు బోగీలను పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు. అలాగే, ప్రయాణికులు రైలెక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ముఖానికి మాస్కులు ధరించేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. ప్రతి కిలోమీటరుకు ఒకటి చొప్పున మెట్రో స్టేషన్లు ఉన్నా... అన్ని చోట్లా నిలిపే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. రద్దీ అంతగా ఉండని స్టేషన్లలో మైట్రో ఆగదని తెలుస్తోంది. 

 

హైదరాబాద్‌ మెట్రో సేవలు ఎప్పుడు ప్రారంభమౌతాయన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు అధికారులు. మెట్రో రైలు తిరగాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్రం నుంచి అనుమతి ఉండాల్సిందే అంటున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: