నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియామకం జ‌రిగింది. దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్ళగా, వారి పిటిషన్లని విచారించిన హైకోర్టు... ప్ర‌భుత్వ ఆర్డినెన్స్ జీవోల‌ను ర‌ద్దు చేస్తూ రమేశ్ కుమార్‌ని తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై టీడీపీతో సహ మిగిలిన ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తూ...జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

 

హైకోర్టు...జగన్ ప్రభుత్వానికి పెద్ద లెంపకాయే కొట్టిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ కూడా చెలరేగిపోయారు. దొరికిందో ఛాన్స్ అన్నట్లుగా జగన్‌పై విమర్శలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వం పరువు రోడ్డు మీదకు వచ్చిందని, అనేక తీర్పులను పట్టించుకోకుండా.. ఏపీలో కనీసం పాలన లేదు అనేది హైకోర్టు తీర్పులే నిదర్శనంగా కనిపిస్తున్నాయని అన్నారు. జగన్ ఇప్పటికైనా రాజకీయాలు చేయడం మాని.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఉచిత సలహా ఒకటి ఇచ్చారు.

 

అయితే బీజేపీలో ఉన్నా సుజనా చౌదరీ పక్కా టీడీపీ నేతలాగానే మాట్లాడరని అర్ధమవుతుంది. ఎలాగో వారి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే సుజనా బాగా హడావిడిగా మాట్లాడుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఒకవేళ నిమ్మగడ్డ విషయంలో ఏమైనా తప్పు జరిగితే ప్రభుత్వం సరిచేసుకుంటుంది. లేదంటే సరైన న్యాయం జరగలేదు అనుకుంటే సుప్రీం కోర్టు వరకు వెళుతుందని చెబుతున్నారు.

 

ఇక జగన్ రాజకీయాలు చేయడం మానేయాలని సుజనా పనికిమాలిన సలహాలు ఇస్తున్నారని,  అసలు జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసని అంటున్నారు. ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి దశలోనూ సీఎం జగన్‌ని అడ్డుకోవడానికే టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఎవరి ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజలు మాత్రం జగన్‌తోనే ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: