దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల్లో కూడా భారత్ చైనాను దాటేసింది. మొత్తం కేసుల సంఖ్య విషయంలో ఇండియా తొమ్మిదో స్థానానికి చేరింది.

 

భారత్‌లో కరోనా విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7,466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష 65 వేల 799 కి చేరింది. మరణాల సంఖ్య 4 వేల 706కు చేరింది. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడ్డ తరువాత  24గంటల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అటు కరోనా మరణాల్లో భారత్‌, చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4 వేల 634 కొవిడ్‌ మరణాలు సంభవించగా.. భారత్‌లో ఈ సంఖ్య 4 వేల 706గా ఉండటం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా కేసుల్లోనూ ప్రపంచంలో భారత్‌ 9వ స్థానానికి ఎగబాకింది. 

 

కరోనా కేసులు చైనా కంటే భారత్ లో రెట్టింపయ్యాయి. చైనాలో ఇప్పటి వరకు 82 వేల 995 కేసులు నమోదుకాగా.. భారత్‌లో ఆ సంఖ్య నేటికి లక్ష 65 వేల 799గా ఉంది. 4 వేల 706 కరోనా మరణాలతో భారత్‌ ప్రపంచంలో 13వ స్థానంలో కొనసాగుతోంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 89 వేల 987 మంది కరోనాకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. 71 వేల 105 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

 

మహారాష్ట్రలో అత్యధికంగా 59 వేల 546 కేసులు ఉన్నాయి. ఇందులో 2 వేల 598 కొత్త కేసులున్నాయి. 1982 మంది చనిపోయారు. తమిళనాడులో 19 వేల 372 కేసులు నమోదు కాగా.. 797 కొత్త కేసులున్నాయి. ఇప్పటివరకూ 145 మంది చనిపోయారు. ఢిల్లీలో 16 వేల 281 కేసులు ఉండగా.. 1024 కొత్త కేసులున్నాయి. ఇప్పటివరకూ 316 మంది కరోనాతో మృతిచెందారు. గుజరాత్ లో మొత్తం కేసులు 15 వేల 572 ఉన్నాయి. కొత్త కేసుల సంఖ్య 377 కాగా.. మొత్తం మరణాల సంఖ్య 960గా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: