చిక్కినట్లే చిక్కుతోంది...మళ్లీ చుక్కలు చూపిస్తోంది. పదిహేను రోజులుగా చిరుత అందరినీ హడలెత్తిస్తోంది. అడవుల్లోకి వెళ్లింది అనుకున్న చిరుత అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రత్యక్షమైంది. ఫారెస్ట్ అధికారులు వెళ్ళేలోపు అక్కడి నుంచి కూడా తప్పించుకుంది. 

 

హైదరాబాద్‌...రాజేంద్రనగర్ పరిసరాల్లో ఓ చిరుత...జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిక్కినట్టే చిక్కి పదిహేను రోజుల నుంచి తప్పించుకుంటోంది. కనిపించకుండా పోయిన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత తచ్చాడినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ చుట్టూ.. చిరుత పాద ముద్రల ఆనవాళ్లున్నాయి. సమీపంలో ఉన్న చిన్న నీటికుంట వద్ద నీళ్లు తాగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కనిపించాయి. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు చిరుత కోసం గాలించారు. 20 ట్రాప్ కెమెరాలు, అక్కడక్కడా 5 బోన్లు ఏర్పాటు చేశారు. అయినా...ఎక్కడా చిరుత జాడ మాత్రం కనిపించలేదు. 

 

అయితే కెమెరాల ద్వారానే చిరుతని గుర్తించొచ్చు అని...ఒకటి రెండు రోజుల్లో బోన్లలో చిక్కే అవకాశం కూడా ఉంది అంటున్నారు అటవీశాఖ అధికారులు. అడవిలోకి వెళ్లిందిలే అని అనుకున్న చిరుత...మళ్లీ ప్రత్యక్షమవడంతో రాజేంద్రనగర్ వాసులు భయాందోళన చెందుతున్నారు.

 

అంతకుముందు...రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర నడిరోడ్డుపై హల్చల్ చేసింది చిరుత. ఓ డ్రైవర్‌ని గాయపరిచి పక్కనే ఉన్న ఫామ్‌హౌజ్‌లోకి వెళ్ళిపోయింది. చిరుతని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు సుమారు 48 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. అయినా...ఫలితం లేకుండా పోయింది. ఫామ్‌హౌజ్ నుంచి కూడా తప్పించుకుంది. 

 

అయితే మళ్లీ రెండు రోజుల తర్వాత...హిమాయత్‌సాగర్‌లో కనిపించినట్టు మత్స్యకారులు చెప్పారు. అక్కడికి వెళ్లిన అటవీశాఖ సిబ్బంది...చిరుత ఫుట్ ప్రింట్స్ కనిపించాయని, చిలుకూరు అడవుల్లోకి వెళ్లిందని గుర్తించారు. మొయినాబాద్ ప్రాంత వాసులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. రాత్రివేళల్లో సంచరిచొద్దని చెప్పారు. కొన్ని రోజులుగా చిరుత జాడ లేకపోవడంతో.. ఊపిరి పీల్చుకున్న రాజేంద్రనగర్ వాసులకు పదిహేను రోజుల తర్వాత మళ్లీ చిరుత టెన్షన్ మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: