ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ వైర‌స్  బారిన ప‌డుతున్నాయి. ప్ర‌ధానంగా కరోనా మరణాల్లోనూ అమెరికా పేరుకు తగినట్లుగానే అగ్రస్థానంలో కొనసాగుతున్నది. అక్కడ ఇప్పటివరకు మొత్తం 1,02,116 మంది చనిపోయారు. కొరియన్‌ యుద్ధం మొదలుకొని ఇప్పటివరకు జరిగిన అన్ని యుద్ధాల్లో మరణించిన అమెరికా సైనికులు సంఖ్య కన్నా ఇది ఎక్కువేనని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది. కాగా ఇదే స‌మ‌యంలో షికాగో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్టు సారా కోబే సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. కరోనా వైరస్‌ ఎక్కడికీ పోదని ఆమె తేల్చిచెప్పారు.

 


క‌రోనా క‌ల‌క‌లం గురించి సారా స్పందిస్తూ, ఈ మ‌హ‌మ్మారికి టీకా వ‌చ్చినా.. మన మధ్యనే ఉంటుందని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ``క‌రోనా బారిన పడకుండా ఎలా జీవించాలన్నదే మనం ఇప్పుడు ఆలోచించాలి. స్మాల్‌పాక్స్‌కు టీకా కనుగొని 200 ఏళ్లు గడిచినా అది ఇంకా ఉనికిలోనే ఉంది. కరోనాపై పోరుకు దీర్ఘకాల వ్యూహాలు అవసరం. అన్ని దేశాలు కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.`` అని ఆమె వెల్ల‌డించారు.

 

ఇదిలాఉంగా, అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం కొన‌సాగుతోంది. 1968లో ఫ్లూ మహమ్మారి వల్ల చనిపోయిన వారి సంఖ్యకు సమానంగా అమెరికాలో  1,02,116 మంది చనిపోయారు. పదేళ్ల‌ క్రితం ప్రతాపం చూపిన మరో ఫ్లూలో 1,16,000 మంది మరణించారు. ఇప్పుడు కరోనా మృతుల సంఖ్య పదేళ్ల‌ క్రితం నాటి ఫ్లూ మరణాల సంఖ్యకు చేరువవుతున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్ వెల్ల‌డించారు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ జంట భవనాలపై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య (2,977)కు ఇది 33 రెట్లు అధికంగా ఉండటం విశేషం. కరోనాతో మరణించిన వారిలో నల్లజాతి అమెరికన్లు 26.3 శాతం ఉండగా ఆసియా అమెరికన్లు 4.7 శాతం ఉన్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ నగరాల్లో భారతీయ అమెరికన్లు 500 మందికిపైగా చనిపోయినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా వైరస్‌ వల్ల చనిపోగా మూడోంతుల మంది అమెరికన్లే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: