కొన్ని సంద‌ర్భాల్లో సంక్షోభాల్లో కూడా అవ‌కాశాలు వెతుక్కోవాల్సి వ‌స్తుంది. ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల్లో కూడా మ‌న స‌త్తా ఏంటో చూపించాల్సి వ‌స్తుంది. తాజాగా అలాంటి విశ్లేష‌నే ఇప్పుడు హైద‌రాబాద్ విష‌యంలో సూట్ అవుతుంది. క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో విధించిన లాక్ ‌డౌన్ స‌మ‌యంలో కీల‌క మార్పులు జ‌రిగిపోతున్నాయి. లాక్ డౌన్ వ‌ల్ల‌ రోడ్లపై రద్దీ తగ్గడంతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వేగంగా సాగిపోతున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ పనుల వేగం పెరిగి పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరికొన్ని తుది దశకు చేరుకున్నాయి. ఈ మేర‌కు ప్రారంభోత్స‌వాలు కూడా జ‌రిగిపోతున్నాయి.

 


హైద‌రాబాద్‌లో కీల‌క‌మైన జంక్ష‌న్లు, రోడ్లు, ప్రాంతాల‌ను అభివృద్ధి చేసేందుకు ఎస్ఆర్డీపీ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా లాక్ డౌన్‌లో కీల‌క ప‌నులు ముందుకు సాగాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఎల్బీనగర్‌ జంక్షన్‌లో ఒక అండర్‌పాస్‌, అలాగే కామినేని జంక్షన్‌లో ఒక మూడు లేన్ల ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పూర్తయ్యాయి. పంజాగుట్ట గ్రేవ్‌యార్డ్‌ వద్ద స్టీల్‌ బ్రిడ్జి, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. నాగోల్‌ జంక్షన్‌లో ఆరు లేన్ల ఫ్లైఓవర్‌, బైరామల్‌గూడ జంక్షన్‌లో మూడు లేన్ల ఫ్లైఓవర్‌, ఒవైసీ దవాఖాన జంక్షన్‌లో మూడు లేన్ల ఫ్లైఓవర్‌, బహదూర్‌పుర జంక్షన్‌లో ఆరు లేన్ల ఫ్లైఓవర్‌, బయోడైవర్సిటీ జంక్షన్‌లో మూడు లేన్ల ఫ్లైఓవర్‌, రోడ్‌ నంబర్‌-45లో నాలుగు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌, ఓయూ కాలనీ షేక్‌పేట్‌లో ఆరులేన్ల ఫ్లైఓవర్‌, హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ ఆర్‌యూబీ-ఆరు లేన్ల రైల్వే అండర్‌ బ్రిడ్జి, చింతలకుంట జంక్షన్‌లో అండర్‌పాస్‌, కొత్తగూడ-కొండాపూర్‌ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, శిల్పా లేఔట్‌ గచ్చిబౌలి, ఖైత్లాపూర్‌ ఆర్‌వోబీ, పంజాగుట్ట శ్మశానవాటిక ర్యాంపు తదితర పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.  దుర్గం చెరువుపై ఊగే వంతెన నిర్మాణం పనులు కూడా పూర్తికావచ్చాయి.

 

 

ఇదిలాఉండ‌గా, హైదరాబాద్ నగరంలో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులతోపాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై జీహెచ్‌ఎంసీ అధికారులతో ఇటీవ‌ల‌ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో నగరంలో చేయాల్సిన పనులు, పెండింగ్‌ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరాభివృద్ధిలో తలమానికంగా నిలిచిన రోడ్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని స్పష్టంచేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: