ప్ర‌స్తుతం ఆన్‌లైన్ మోసాల‌కు అడ్డేలేదు. సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తూ.. మంచి గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ... ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు వాహనాలను విక్రయిస్తున్నామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు అత్యాశకు పోయి.. మరికొందరు తక్కువ ధరకు వస్తున్నాయంటూ నమ్మి మోసపోతున్నారు. ఇంకొందరు కస్టమర్‌కేర్‌ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్‌చేసి.. సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా..అమాయకులను టార్గెట్‌ చేసుకున్న సైబ‌ర్ నేర‌గాళ్లు వారిని నిండా ముంచేస్తున్నారు. అయితే, సైబర్‌ మోసం విష‌యంలో పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మోసం జరిగిందా మెయిల్‌ చేయండి చాలు అంటూ పిలుపునిస్తున్నారు.

 

 

ఉద్యోగాలు, ఇన్సూరెన్స్‌, సెల్‌ టవర్స్‌, వ్యాపార లావాదేవీలు, ఫ్రెండ్‌షిప్‌, మంచి కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ  కొందరు సైబర్‌ నేరగాళ్లు కొన్ని పట్టణాల్లోని కాల్‌సెంటర్లను అడ్డాగా చేసుకొని అమాయకులకు ఫోన్లు చేస్తుంటారు. అయితే దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో కొన్ని పట్టణాల్లోని కాల్‌సెంటర్లకు తాళాలు పడగా నేరాలు తగ్గుముఖం పట్టాయి. సైబర్‌ నేరాల్లో ఆరితేరిన కొందరు నైజీరియన్లు కూడా నేరాలను తగ్గించారు. అయితే, లాక్‌డౌన్‌కు కేంద్రం సడలింపు ఇవ్వడంతో చాలా పట్టణాల్లో కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. అదే సమయంలో సైబర్‌ నేరాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.  సడలింపులు ఇవ్వడంతో సైబర్‌ నేరగాళ్లు తిరిగి రెచ్చిపోతున్నారు. ఓటీపీలు తెలుసుకొని బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. ఇలాంటి నేరగాళ్లు వేసే వలలో తెలివైన వారే పడుతుండటం విశేషం. మోసపోయిన వారు సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేసిన సమయంలో అంతా తమకు తెలుసుననే భావనతో ఉండడం.. ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరన్నది నిర్ధారణ చేసుకోకపోవడం.. క్యూఆర్‌ కోడ్‌ పంపితే అది డబ్బు అవతలి వాళ్లకు పంపించేందుకు వచ్చిన కోడా? తమకు వచ్చేందుకు పంపిందా? అన్న కనీస అవగాహన లేకుండా..  కొందరు అత్యాశకు పోయి.. మరికొందరు నిర్లక్ష్యంతో.. ఇంకొందరు మిడిమిడి జ్ఞానంతో సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి మోసపోతున్నారు. గుడ్డిగా ఓటీపీలు చెప్పేశానంటూ కొందరు.. అవతలి వ్యక్తి ఆర్మీ అనే సరికి నమ్మేశానంటూ మరికొందరు ఠాణాలకు వచ్చి వాపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 

 


ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఫిర్యాదు దారులు సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌కు రాకుండా వారు సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్‌ ఫోన్‌ నంబరు-9490617310 లేదా మెయిల్‌ ఐడీ sho-cybercrimes @ tspolice.gov.in  ఫిర్యాదు చేస్తే చాలని ఏసీపీ సైబర్‌ క్రైమ్స్‌ సీహెచ్‌వై శ్రీనివాస్ ‌కుమార్‌ తెలిపారు. కొద్ది రోజుల వరకు ఇలా కేసుల దర్యాప్తు ఉంటుందన్నారు. కాగా, ఈ మధ్యకాలంలో చాలా మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇలా ఇంటి వ‌ద్ద నుంచే ఫిర్యాదు చేస్తే తాము కేసు నమోదు చేసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: