ఆరోగ్యశ్రీ పేరుచెబితే ముందు గుర్తొచ్చేది వైఎస్సార్. వైఎస్ ను ఓ మానవీయ నాయకుడిగా నిలబెట్టిన పథకం అది. స్వయంగా వైద్యుడైన ఆయన సీఎం అయ్యాక ఈ పథకంతో ఇంటింటి వైద్యుడిగా అవతరించారు. జననేతగా ఎదిగారు. అందుకే వైఎస్ జగన్ సైతం ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అంతే కాదు.. తండ్రి ప్రవేశ పెట్టిన పథకానికి అనేక జోడింపులు చేర్చి.. మరింతగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు.

 

 

ఆరోగ్యరంగానికి ఏం చేయబోతున్నాడో మేనిఫెస్టోలో ముందే చెప్పాడు. సంవత్సరకాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం.. ఆరోగ్యశ్రీ పరిస్థితిని సంవత్సరానికి రూ.5 లక్షల వరకు అంటే.. నెలకు రూ.40 వేల సంపాదించే వారికి కూడా వర్తింపజేస్తున్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇలా 1.42 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి.

 

 

అంతే కాదు.. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టు కిందకు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఇంతకు ముందున్న వెయ్యి రోగాలు కాకుండా 2 వేల రోగాలకు వర్తింపజేసేలా పశ్చిమగోదావరిలో పైలెట్‌ ప్రాజెక్టు నడుస్తోంది. ఈ జూలై 8వ తేదీన వైఎస్ పుట్టిన రోజున మరో 6 జిల్లాల్లో 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయిస్తామంటున్నారు జగన్.

 

 

ఆ తరువాత మిగిలిన ఆరు జిల్లాల్లో దీపావళి నాటికి నవంబర్‌లో పూర్తిగా రాష్ట్రమంతా 2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించేలా వర్తింపజేస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 వందల జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించిన వైద్యం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. అంతే కాదు.. ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందాలని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 132 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వర్తింపజేస్తున్నారు. మొత్తం మీద తండ్రి కంటే ఓ రెండు అడుగులు జగన్ ముందే ఉన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: