దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కు  సెంటర్ గా మారింది. ముంబై పోలీస్ శాఖలోనూ వైరస్ కలకలం రేగుతోంది. ముంబైలో మే మొదటి వారంలో మొదలైన కరోనా పీక్ కర్వ్.. ఇంతవరకూ ఫ్లాట్ స్టేజ్ కు చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

 

మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 60 వేలకు చేరుకుంటోంది. గత 24 గంటల్లో ఏకంగా 2500 కొత్త కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను మరి కొంతకాలం పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. నేడు, రేపు పరిస్థితిని సమీక్షించి అప్పుడు ఓ నిర్ణయానికి వస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయన్నారు. రెడ్‌జోన్‌లోని ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్తుండడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు ఆరోగ్య మంత్రి తెలిపారు. జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్లను పెంచాల్సి ఉంటుందని అన్నారు. పరిస్థితి నియంత్రణలోకి వస్తుందన్న నమ్మకం తమకుందని  పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 59,546 కేసులు నమోదు కాగా, 1982 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

కరోనా మహమ్మారికి విలవిల్లాడుతున్న పోలీసుల సంఖ్య గత 24 గంటల్లో మహారాష్ట్రలో అనూహ్యంగా పెరిగింది. కొత్తగా మరో 116 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ముగ్గురు పోలీసులు మృత్యువాత పడినట్టు రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ బారిన పడిన మొత్తం పోలీసుల సంఖ్య 2 వేల 211కు చేరుకోగా, ఇంతవరకూ 25 మంది మృతి చెందారు. ముంబైలో అధిక జనసాంద్రత కూడా కరోనా ముప్పుకు కారణమైంది. ముంబైలో 2 కోట్ల మంది జనాభా ఉన్నారు. దేశంలో అత్యధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో ముంబై ముందువరుసలో ఉంది. కరోనా నియంత్రణకు సోషల్ డిస్టెన్సే మందు. ఎంత మాస్కులు పెట్టుకున్నా.. భౌతిక దూరం పాటించాల్సిందే. కానీ ముంబై మహానగరంలో.. రెండు కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు సోషల్ డిస్టెన్స్ సాధ్యం కాలేదు. ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూడా పుట్టగొడుగుల్లా ఉండటంతో.. ఎవరింట్లో వాళ్లున్నా.. కరోనా ముప్పు ఎక్కువగానే ఉందని నిపుణుల అధ్యయనంలో తేలింది. 

 

కరోనా రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ధారావిని దిగ్బంధం చేశారు. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అసలే చిన్న చిన్న గదులు.. ఇరుకైన సందులు.. గాలి కూడా సరిగా ఆడని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిసరాల్లో అందరూ ఇళ్లలో ఉండడం కష్టతరం గా మారింది. ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనులకు వెళ్లి రాత్రి పడుకునేందుకే గదులకు వచ్చేవారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉం డాల్సి వస్తోంది. వీరిని ఇళ్లలో ఎలా నిర్బంధించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ధారావిలో అత్యంత జనసాంద్రత కారణంగా కరోనా చాలా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు బీఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: