తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలి‌సిందే. రాష్ట్రంలో టెస్టుల గురించి వివిధ ర‌కాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌న్నిహితుడు,  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌రోనా విష‌యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. కరోనాను లైట్ తీసుకోవద్దని జూన్, జులై నెలల్లో మరిన్ని ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. 

 

కరీంనగర్ జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మంత్రి ఈటల మాట్లాడుతూ  మొదటి రెండు నెలలు లాక్​డౌన్  విషయంలో సీరియస్ గా వ్యవహరించామని, అందుకే ఎక్కువ కేసులు నమోదు కాలేదన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నందున పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయిస్తామని ఈటల స్పష్టం చేశారు. లక్షణాలు లేనివారిని హోం క్వారంటైన్‌‌లో ఉంచుతామన్నారు. ఇంట్లో వసతులు లేనివారు హోటల్‌‌ క్వారంటైన్‌‌లో ఉండొచ్చన్నారు. హోటల్ ఖర్చులు భరించలేనివారిని, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతామన్నారు. విదేశాల నుంచి వస్తున్న వారికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయని మంత్రి వివరించారు.

 

 

కుటుంబ సభ్యుల్లో వృద్ధులు, ఇతర వ్యాధులతో బాధపడేవారికి మాత్రం లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయిస్తున్నామని, మిగతవాళ్లను హోం క్వారంటైన్ చేస్తున్నామని మంత్రి ఈట‌ల‌ తెలిపారు. హైదరాబాద్‌‌లోని 8 సర్కిళ్లలోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని మంత్రి తెలిపారు. జీహెచ్‌‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఏడెనిమిది కంటైన్‌‌మెంట్ జోన్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీలో కేసులు ఎక్కువగా వస్తున్నందున, అక్కడ మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసులు సంఖ్యను బట్టి కంటైన్‌‌మెంట్ చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: