కరోనా వైరస్ ప్ర‌బ‌ల‌డంతో ప్రపంచ దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రభావం మ‌న దేశంపై కూడా పడింది. ఇటీవల విడుదల చేసిన జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ అంశాలు బలంగా ఉన్నాయో, ఏ అంశాలు బలహీనంగా ఉన్నయో తెలిపేందుకు ఉపయోగపడుతాయి. 2019-20 సంవత్సరంలో గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌ వృద్ధి వ్యవసాయ రంగంలో అధికంగా కనిపించింది. ఇది 2019-20లో 4శాతం వృద్ది ఉండగా.. ఇది 2018-19లో 2.4 శాతంగా ఉంది. మైనింగ్ , క్వారీ రంగాల్లో 2018-19లో నెగిటివ్‌లోకి జారుకోగా 2019-20లో ఇది 3.1 శాతానికి చేరుకుంది. ఈ రెండు రంగాలు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

క‌రోనా మ‌హ‌మ్మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న‌ది. 2019-20 ఆర్థిక సంవత్స‌రానికి గాను భార‌త‌దేశ జీడీపీ వృద్ధిరేటు 11 ఏళ్ల‌‌ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయ గణాంక సంస్థ వెల్ల‌డించిన వివరాల ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి- మార్చి త్రైమాసికం) భార‌త‌ జీడీపీ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదైంది. ప్ర‌స్తుత ప‌రిణామల నేప‌థ్యంలో ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కోవిడ్-19 ప్రభావం పడకూడదని ఆలోచించి పలు విధానపరమైన సంస్కరణలు తీసుకొచ్చింద‌ని పేర్కొంటున్నారు. మైనింగ్‌లో ప్రైవేట్ రంగాలకు కూడా అవకాశం కల్పిస్తూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వల్ల మైనింగ్ రంగంలో మరింత వృద్ధి సాధించడమే లక్ష్యమని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది.

 

ఇక, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం (2019-2020) మొత్తానికి భార‌తదేశ జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతంగా న‌మోదు అవుతుంది.  2018-19 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది చాలా త‌క్కువ‌. 2018-19 ఆర్థిక ఏడాదిలో 6.1 శాతంగా ఉన్న భార‌త‌దేశ జీడీపీ వృద్ధి రేటు 2019-2020 ఆర్థిక ఏడాదిలో 4.2 శాతానికి ప‌డిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: