ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాల మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పటికే 90 శాతం హామీలను పూర్తి చేశారు. మిగిలిన హామీలు ఎప్పటినుండి అమలవుతాయో తేదీలను ప్రకటించారు. జగన్ ఏడాది పాలనలో సంక్షేమం బాగానే జరిగినా అభివృద్ధిని మాత్రం విస్మరించారని ప్రజలు చెబుతున్నారు. 
 
వివిధ వర్గాలకు అమలు చేస్తామని చెప్పిన పథకాలను మాత్రం చెప్పిన విధంగానే అమలు చేశారు. ప్రాజెక్టుల విషయంలో కూడా వేగంగానే ముందుకెళుతున్నారు. పాత పథకాలను మాత్రం కొన్నింటిని తొలగించారు. పేదలకు, కొన్ని వర్గాలకు జగన్ చేరువయ్యారు. మధ్య తరగతి వారికి మాత్రం జగన్ ఏడాది పాలనలో పెద్దగా ప్రయోజనం చేకూరలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
మధ్య తరగతి ప్రజలు రాజధానులు వేగంగా అభివృద్ధి చెందాలని... ఉపాధి అవకాశాలు పెరగాలని ఆశిస్తున్నారు. వ్యాపారాలతో పాటు పరిశ్రమలు పెరగాలని భావిస్తున్నారు.రాష్ట్రంలో గడచిన సంవత్సర కాలంలో రవాణా రంగం దెబ్బ తిందని... రియల్ ఎస్టేట్ పై ఆధారపడిన రంగాలన్నీ దెబ్బ తిన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు త్వరగా జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
 
పలు సర్వేల్లో జగన్ పరిపాలన బాగుందని 60 నుంచి 65 శాతం మంది అద్భుతంగా ఉందని చెప్పగా మిగిలిన వారు మాత్రం జగన్ పాలన గొప్పగా లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేయించడం, వాలంటీర్ల ద్వారా నిరంతరం సర్వే చేయించడం, కరోనా విజృంభణ సమయంలోను రైతుభరోసా, సున్నావడ్డీ, జగనన్న విద్యా దీవెన, ఇతర పథకాలను అమలు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: