గత కొన్ని రోజులుగా భారత్ చైనా వివాదం గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. భారత్ చైనా వివాదంలో కేంద్రం దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తోంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా భారత్ సమాన సంఖ్యలో దళాలను మోహరించాయి. ఈ నెల 5, 6 తేదీల్లో లద్దాఖ్ లోని పాంగోంగ్ లో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. 
 
లద్దాఖ్ లో ఇరు దేశాల సైనికులు తలపడితే 2017లో జరిగిన డోక్లాం వివాదం తరువాత ఇదే అతి పెద్ద వివాదం అవుతుందని ఇరు దేశాలు భావిస్తున్నాయి. అప్పట్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ వివాదంపై స్పందించారు. దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని... ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామని తెలిపారు. 
 
ఈ వివాదంలో మరో దేశం జోక్యం చేసుకోవడానికి వీలు లేదని ఆయన అన్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దీనిపై తాను కామెంట్ చేయబోనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని షా చెప్పారు. సరిహద్దు భద్రత తమకు ముఖ్యం అని... ఎలాంటి హాని కలిగించబోనీయమని తెలిపారు. 
 
ఇతరులు దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడానికి భారత ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు కూడా సమస్య పరిష్కారం వైపే మొగ్గు చూపుతున్నాయని... త్వరలో సమస్య తీరిపోతుందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలన్నింటితో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని చెప్పారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: