ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య పోరాటం అనేక మలుపులు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్సును ఏపై హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు తర్వాత ఇక రమేశ్ కుమార్ రాష్ట్రఎన్నికల కమిషనర్ గా కొనసాగుతున్నట్టుగానే అంతా భావించారు.

 

 

నిమ్మగడ్డ తరపు వాదించిన న్యాయవాదులు కూడా కోర్టు తీర్పు తర్వాత బయటకు వచ్చి మీడియాతో ఆ విషయమే చెప్పారు. కానీ ఇప్పుడు అడ్వకేట్ జనరల్ మాత్రం ఆ విషయంలో స్పష్టమైన ఆదేశాలేమీ ప్రభుత్వానికి ఇవ్వలేదని చెబుతున్నారు. అంతే కాదు.. నిర్ధిష్ట కాలపరిమితి విధించని సమయంలో తగిన చర్య తీసుకునేందుకు తమకు రెండు నెలల సమయం ఉంటుందని చెబుతున్నారు.

 

 

ఒకసారి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దానికి భిన్నంగా ముందుకు వెళ్లాలని భావించడం అసాధారణమే అవుతుంది. అయితే ఆ తీర్పులోనే స్పష్టత కరవైందని అడ్వకేట్ జనరల్ చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు. హైకోర్టులోనే స్టేకు దరఖాస్తు చేస్తామంటున్నారు. ఏదేమైనా నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉండకుండా ఏమేరకు ప్రయత్నించాలో ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావించాలి.

 

 

అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నిమ్మగడ్డకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆయన ఇక తాను మళ్లీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించానని కోర్టు తీర్పు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే ప్రకటించేశారు. అంతే కాదు.. ఆ హోదాలో ఆయన కొన్ని శాఖలను ఆదేశాలు కూడా జారీ చేశారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తే ఆయన ఇంకా ఆ సీటులో ఇప్పుడే కూర్చునే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికి జగన్ వర్సస్ నిమ్మగడ్డ పోరాటం కొత్త పుంతలు తొక్కుతుందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: