భారత్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో 8,380 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 1,82,143కు చేరగా మృతుల సంఖ్య 5164కు చేరింది. గడచిన 24 గంటల్లో 193 మంది మృతి చెందారు. 
 
ఈరోజు ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్నా కరోనా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 86,983 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 89,995 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,197 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.

 

లాక్ డౌన్ సడలింపుల వల్లే గత కొంతకాలంగా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం నిన్న లాక్ డౌన్ నిబంధనలు సడలించింది. తాజా సడలింపులతో రాష్ట్రంలో మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరచుకోనున్నాయి. ప్రార్థనా మందిరాలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దేవాలయాలు, మసీదులు, చర్చీలు తెరచుకోనున్నాయి. కేంద్రం కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో లాక్ డౌన్ సడలింపులను అమలు చేస్తోంది. 

రైళ్లు, విమానాల విషయంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.... భౌతిక దూరం పాటించాలని... ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: