తెలంగాణలో మరోసారి బస్సు చార్జీలు పెరగనున్నాయి. వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకునేందుకు ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమని భావిస్తున్న అధికారులు.. ఆ దిశగా కసరత్తు మొదలెట్టారు.లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాల వివరాలతో పాటు.. ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.


 
మూలిగే నక్క పై తాటికాయ పడిందన్నట్టు.. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాక్ డౌన్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సుమారు 60 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితం ఆదాయం జీరోగా మారింది. ప్రభుత్వం సడలింపులివ్వడంతో హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో బస్సులు తిరుగుతున్నప్పటికీ.. అంతగా ఆదాయం రావడం లేదు.

 

ఇక గ్రేటర్‌లో కేవలం బస్సుల నిర్వహణ తప్ప.. సర్వీసులు తిప్పడం టీఎస్‌ఆర్టీసీ చేతుల్లో లేదు. అన్నీ జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉన్నాయి. 2015లోనే గ్రేటర్‌ ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం. సిటీ సర్వీసులతో నష్టాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆర్టీసీని తాము నిర్వహించలేమనీ పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసినా  స్పందన కరువైంది. చివరకు ఆర్టీసీని వదిలించుకుంటామని జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో తీర్మానం కూడా చేశారు. అయినా ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే ప్రస్తుతం గ్రేటర్‌లో బస్సులు తిరక్కుండా ఉంటే, నష్టాలను నివారించినట్టేననే జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

 

త్వరలోనే టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. డిగ్రీ పరీక్షలు, వివిధ పోటీ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే తేదీలు ఖరారయ్యాయి. అందుకే బస్సులు తిప్పడం అనివార్యమని ప్రభుత్వం భావిస్తోంది. బస్సులో 20 మంది ప్రయాణీకుల్ని మాత్రమే అనుమతించాలని ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఇలా అయితే, నష్టాల భారం మరింత పెరుగుతుందని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే గ్రేటర్‌ పరిధిలో బస్సు చార్జీలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. 

 

ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రభుత్వం కిలోమీటర్‌ కు 20 పైసలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా బస్సు చార్జీలు పెంచింది. చిల్లర సమస్య పేరుతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 5, 10, 15, 20 రూపాయల వంటి రౌండ్‌ ఫిగర్స్‌ను అమల్లోకి తెచ్చి, భారాన్ని మరింత పెంచింది. ఇప్పుడు కోవిడ్‌-19 మార్గదర్శకాల పేరుతో సిటీలో మరోసారి చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీల పెంపు ఉంటుందా? లేక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఛార్జీలు పెంచుతారా అనే విషయంలో ఆర్టీసీ తర్జనభర్జన పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: