తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం రోజురోజుకూ ముదురుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. అందుకే సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కృష్ణా బోర్డు ప్రకటించింది. హైదరాబాద్‌ జలసౌధలో జూన్‌ 4వ తేదీన ఉదయం 11 గంటలకు బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సమాచారమిచ్చింది.

 

తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం ముదరడంతో.. సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. తెలంగాణ, ఏపీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ సామర్థ్యాన్ని పెంచారని.., వాటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం తెలంగాణపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణాబోర్డు.. ఈ అంశాలకు సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల సమగ్ర వివరాలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 

కృష్ణా బోర్డ్ మీటింగ్ లో చర్చించే అంశాల పై తెలంగాణ ఇరిగేషన్ ముఖ్య అధికారులు చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో నాలుగు అంశాల మీదనే చర్చించాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును వెంటనే ఆపాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ అనుమతి లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలా కడతారని  ప్రశ్నిస్తోంది. పట్టిసీమ నీళ్ళలోనూ, తమకు వాటారావాలని తెలంగాణ పట్టుబట్టనుంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించారని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు కృష్ణా నది నికర జలాల్లో 45 టిఎంసిల వాటా పెరగాల్సి ఉందని తెలంగాణ అంటోంది. 

 

బచావత్ ట్రిబ్యునల్ లోని 7వ క్లాజ్ ..  తాగునీటికి వాడుకుంటున్న నది జలాల్లో నీటి వినియోగాన్ని 20 శాతంగా గుర్తించాలని స్పష్టం చేస్తోందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కేఅర్ఎంబి, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ లను ఎలా కడుతుందని ప్రశ్నిస్తున్నారు. పోతి రెడ్డి పాడు పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని, కృష్ణా నది పై నిర్మాణం లో ఉన్న ప్రాజెక్ట్ లు ఏపీలోని గత ప్రభుత్వం తో చర్చించి అపెక్స్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసినవేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వీటితో పాటు టేలిమెట్రీ పరికరాల ఏర్పాటు పై బోర్డును ప్రశ్నించేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ జలవివాదాన్ని పరిష్కరించేందుకే.. జూన్‌ 4న సమావేశం ఏర్పాటు చేసింది కృష్ణాబోర్డు. 

మరింత సమాచారం తెలుసుకోండి: