గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో నిమ్మగడ్డ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. నిన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగాలని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని చేసిన వ్యాఖ్యలతో నిమ్మగడ్డ పదవి విషయంలో కొంత గందరగోళం నెలకొంది. శ్రీరామ్ వ్యాఖ్యలతో జగన్ సర్కార్ నిమ్మగడ్డ రమేష్ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్లు అడ్వకేట్ జనరల్ చెప్పారు. 
 
శ్రీరామ్ వ్యాఖ్యల అనంతరం  జగన్ సర్కార్ ఎన్నికల సంఘం కార్యదర్శిగా వాణీమోహన్ ను నియమించింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వైసీపీ హైకోర్టు తీర్పుతోనైనా బుద్ధి తెచ్చుకోవాలని చెబుతూ ఎదురుదాడికి దిగుతోంది. నిమ్మగడ్డను వెనకేసుకొని రావడం ద్వారా ఆయననను టీడీపీ కార్యకర్తగా భావించాల్సి వస్తోందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. 
 
టీడీపీ న్యాయనిపుణులు హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించవచ్చని చెబుతుండగా... అధికార పక్షానికి చెందిన న్యాయ నిపుణులు మరలా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానం గవర్నర్ కు పంపి... గవర్నర్ ఆమోదం తరువాత మాత్రమే ఆయన పదవి స్వీకరించాలని చెబుతున్నారు. వైసీపీ అంతలోపే సుప్రీంను ఆశ్రయించి తీర్పుపై స్టే తీసుకోవాలని భావిస్తోంది. 
 
ఆర్డర్ వచ్చిన వెంటనే ఎందుకు నియమించరని టీడీపీ ప్రశ్నిస్తుంటే ఆనాడు రోజా విషయంలో మీరెలా వ్యవహరించాలో గుర్తు తెచ్చుకోవాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. రోజాను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినప్పుడు సుప్రీం కోర్టు ఆమెను సభకు అనుమతించాలని ఆదేశించింది. అయినా టీడీపీ రోజాను అసెంబ్లీలోకి రానివ్వలేదు. రోజా విషయంలో అలా వ్యవహరించడం వల్ల టీడీపీకి ఆయనను నియమించమని చెప్పే నైతికత లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే నిమ్మగడ్డకు మాత్రం జగన్ సర్కార్ శ్రీరామ్ తో చేయించిన వ్యాఖ్యలు, వాణీ మోహన్ నియామకం ద్వారా వరుస షాకులు ఇచ్చింది. ప్రస్తుతం నిమ్మగడ్డ నియామకాన్ని వీలైనంత ఆలస్యం చేయాలని... అంతలోపు సుప్రీంను ఆశ్రయించి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని వైసీపీ కోరనుంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: