క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో..ప్ర‌జ‌లంతా ఈ మ‌హ‌మ్మారితో ఆందోళ‌న‌లో ఉన్న స‌మ‌యంలో...జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనూహ్య‌మైన అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. క‌రోనా క‌ష్టాల‌తో పాటుగా మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కుంటున్న వివిధ వ‌ర్గాల‌ను ప్ర‌స్తావించారు. కీల‌క‌మైన‌ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. వారి సంక్షేమ‌ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. 

 

 

ఇల్లు నిర్మించుకొంటున్నవాళ్ళు... నిర్మాణాలు చేపట్టినవాళ్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సెస్ చెల్లిస్తారు... ఆ నిధులు ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. మండలిలో ఉన్న నిధులను ప్రభుత్వంలో ఉన్నవారు ఇతర ప్రయోజనాలను ఆశించి మళ్లిస్తూ ఉండటంతో కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తేనే న్యాయం జరుగుతుంది... కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు వారికే చేరాలన్నారు. ఇసుక సరఫరాను సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని ప‌వ‌న్‌ అన్నారు. కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ మూలంగా గత రెండు నెలలుగా పనులు లేక ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొన్న  భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోన సమయంలో ఈ కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఏ విధంగా వ్యయం చేశారో వెల్లడించాలన్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని భవన నిర్మాణ కార్మికులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 13 జిల్లాల నుంచీ 150 మంది  భవన నిర్మాణ కార్మికులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ సమస్యలను వివరించారు. గత యేడాది ప్రభుత్వం ఇసుక విధానం మారుస్తామని ఇసుక ఆపేయడంతో సుమారు 5 నెలలపాటు పని లేకుండా పోయిందని, ఇప్పుడు కరోనా, లాక్డౌన్ తో పనులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఇసుక అందుబాటులో లేకపోవడం, భారీగా ధరలు ఉండటంతో నిర్మాణాలు నిలిచి ఉపాధి కరవైందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: