తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తీసుకునే నిర్ణ‌యంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల కృష్ణా జ‌లాల విష‌యంలో ఒకింత పొరాపొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్ర‌చారం జ‌రిగిన‌ప్ప‌టికీ....అది టీ క‌ప్పులో తుపానుగా మారిపోయింది. అయితే, తాజాగా లాక్ డౌన్ విష‌యంలో తెలుగు రాష్ట్రాలు అనుస‌రించే వైఖ‌రిపై ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య రాక‌పోక‌ల గురించి.

 

కేంద్ర ప్రభుత్వం నిన్న లాక్ డౌన్ 5.0 పై తీసుకున్న నిర్ణయాన్ని ఏకీభవిస్తూ తెలంగాణలో జూన్ 30 వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించింది. అయితే  ఈ లాక్‌డౌన్ కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానుంది. కేంద్రం కర్ఫ్యూ వేళల్లో సూచించిన మార్పులకు అనుగుణంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ప్యూ వేళల్లో మార్పులు చేసింది. అలాగే అంతరాష్ట్ర రాకపోకలపై నిషేదం తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్రప్రభుత్వ సడలింపులన్ని యథాతథంగా అమలవుతాయని తెలిపింది.

 


అయితే, కీల‌క‌మైన ప్ర‌జార‌వాణ విష‌యంలో ఇప్పుడు ప్ర‌జల్లో ఉత్కంఠ వ్య‌క్త‌మ‌వుతోంది. ఏపీలో కేసులు ఎక్కువ‌గా ఉన్నందున ప్ర‌జా ర‌వాణ‌ను అనుమ‌తి ఇచ్చేది లేద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే, తాజాగా లాక్ డౌన్ 5.0లో `రాక‌పోక‌లకు` ఓకే చెప్పేశారు. అయితే, వ్య‌క్తిగ‌త వాహ‌నాల వ‌ర‌కే ప‌రిమితం. అయితే, ఏపీకి చెందిన ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్నారు. వారిలో అనేక‌మంది లాక్ డౌన్ కార‌ణంగా ఏపీలో ఇరుక్కుపోయారు. కొంద‌రు ఏపీ వారు హైద‌రాబాద్‌లో ఆగిపోయారు. ఇలాంటి వారిలో అంద‌రికీ సొంత వాహ‌నాలు ఉండ‌క‌పోవ‌చ్చు. వారు ఇప్పుడు త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లాలంటే...అవ‌కాశం ఏది? ఒక‌వేళ ప్ర‌జ‌ల రాక‌పోక‌లే క‌రోనా వ్యాప్తికి కార‌ణం అనుకుంటే...సొంత వాహ‌నాల‌కు ఎలా అనుమ‌తి ఇచ్చారు. ఇదో పెద్ద ప్ర‌శ్న‌. ఇదే స‌మ‌యంలో... రెండు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సులు, ప్రైవేటు బ‌స్సులు ప్ర‌యాణించ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు సౌల‌భ్యం. అంతేకాకుండా రెండు రాష్ట్రాల ఆర్టీసీల‌కు ఆదాయం వ‌స్తుంది కూడా. ఈ విష‌యంలో ఇద్ద‌రు సీఎంలు ఆలోచించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: