ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో దివంగత వైఎస్సార్‌కు సాటి లేదన్న విషయం తెలిసిందే. ఆయన ఐదేళ్లలో పాలనలో మంచి పథకాలు అందించి, పేద ప్రజల గుండెల్లో దేవుడుగా ఉండిపోయారు. అయితే తండ్రిబాటలోనే పయనిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఏడాది లోనే ఊహించని పథకాలు ప్రజలకు అందించారు. ఓ రకంగా చెప్పాలంటే ఏపీ రాజకీయ చరిత్రలో ఏ సీఎం అమలు చేయని విధంగా ప్రజలపై సంక్షేమ జల్లు కురిపించారు.

 

చెప్పిన సమయానికి, చెప్పిన విధంగా పథకాలు అమలు చేశారు. అయితే పథకాలు అమలు చేయడంలో తన తండ్రి వైఎస్సార్‌నే జగన్ దాటేసి తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. ఇక ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెబుతున్నారు. జగన్ పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.

 

1992 నుండి తాను ప్రత్యక్ష  రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ప్రభుత్వాలు చూసానని, అనేక మంది ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో పనిచేశానని, కానీ జగన్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని కొనియాడారు. పనిలో పనిగా చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. టీడీపీ విమర్శలు అన్ని కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని, టీడీపీ హయాంలో చంద్రబాబు అప్పులు తెచ్చి దోచుకుతిన్నారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు.

 

అయితే ఇక్కడ చంద్రబాబు మీద విమర్శలు పక్కనపెడితే, బొత్స పలువురు సీఎంల నాయకత్వంలో పని చేశారు. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో పని చేశారు. ఇక ఆ ప్రభుత్వాల్లో కూడా చూడని విధంగా జగన్ పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని ప్రశంసించారు. అంటే ఇక్కడ ఇచ్చిన మాటకు కట్టుబడి పనులు చేసే విషయంలో వైఎస్సార్ కంటే జగనే ముందు వరుసలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికైతే జగన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నారు అనమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: