ఆదినారాయణరెడ్డి....కడప జిల్లాలో సీనియర్ నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన నేత. అయితే వైఎస్సార్ చనిపోవడంతో జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చి, 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ జగన్ అధికారంలో రాకపోవడంతో, ఆదినారాయణ మనసు టీడీపీ మీదకు వెళ్లింది. బాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా, టీడీపీ కండువా కప్పేసుకున్నారు.

 

పనిలో పనిగా బాబు, ఆదినారాయణని మంత్రి కూడా చేశారు. ఏ మాత్రం నైతికత లేకుండా వైసీపీ మీద గెలిచి, రాజీనామా చేయకుండా బాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే మంత్రి పదవి దక్కాక ఆది ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. వీలు కుదిరినప్పుడల్లా జగన్‌పై విమర్శలు చేశారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ జగన్‌ని ఎగతాళి చేస్తూ వచ్చారు. జగన్‌కు ఎంతసేపు సీఎం పీఠం మీదే ధ్యాస ఉందని సెటైర్లు వేశారు.

 

సరే ఎగతాళి చేసిన రోజులన్నీ చేశారు. కానీ టైమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2019 ఎన్నికలు వచ్చాయి. జగన్ భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయిపోయారు. అటు టీడీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైతే, ఆదినారాయణ కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీ అధికారంలో రావడంతో ఆదినారాయణ భయపడ్డారు. మనకు ఇంకా ఇబ్బందులు తప్పవని భావించి, చంద్రబాబుకు చెప్పి బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలో ఉంటే తనకు ఎలాంటి ఇబ్బందులు రావనే ఉద్దేశంతో అటు వెళ్లారు. అయితే ఆయన అనుకున్నట్లుగానే పెద్దగా ఇబ్బందులు ఏమి ఎదురవ్వడం లేదు.

 

దీంతో మళ్ళీ జగన్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కాకపోతే ఇంకా ఆయన టీడీపీ మనిషి మాదిరిగానే మాట్లాడుతున్నట్లు బాగా అర్ధమవుతుంది. తాజాగా కూడా నిమ్మగడ్డ వ్యవహారంపై స్పందిస్తూ... రాష్ట్రంలో రాక్షస రాజరికం ఉందని, ఎస్‌ఈసీ నిమ్మగ‌డ్డ రమేష్ చ‌ట్ట ప్రకారం న‌డుచుకోవ‌డం సీఎం జ‌గ‌న్‌కు ఇష్టం లేదని, హైకోర్టు తీర్పు ఇచ్చాక దాన్ని వ‌క్రీక‌రిస్తూ మాట్లాడ‌టం బాధాక‌రమని చెప్పారు. అంటే ఇక్కడ టీడీపీ నేతలు ఎలా విమర్శలు చేస్తున్నారో, అలాగే మాట్లాడారు. మొత్తానికైతే ఆది టీడీపీ మనిషే అని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: