నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిమ్మగడ్డ పదవీకాలం తగ్గిస్తూ, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని హైకోర్టు కొట్టేసి, మళ్ళీ రమేష్‌ని ఎస్‌ఈసిుగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీడీపీ నేతలు హడావిడి చేసేస్తూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు ఇది పెద్ద మొట్టికాయ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ వ్యవహారాన్ని ముందుకు వెళ్లనిచ్చేలా కనిపించడం లేదు.

 

ఇంకా ఎస్‌ఈసిపగా కనగరాజ్ కొనసాగుతున్నారు. ఇక ఇదే విషయంపై మళ్ళీ నిమ్మగడ్డ హైకోర్టు గడప తోక్కేందుకు చూస్తున్నారు. ఈలోపు ఏజీ శ్రీరామ్ వచ్చి, తీర్పు వచ్చిన వెంటనే రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగవచ్చని హై కోర్టు చెప్పలేదని ప్రకటన చేశారు. ఇదే అంశాన్ని పట్టుకుని వైసీపీ నేతలు టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే  పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు చంద్రబాబుపై విమర్శలు చేశారు.

 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని తీసుకోని.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, చంద్రబాబుకు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కొనసాగించాలని చంద్రబాబుకు అంత ఆత్రం ఎందుకని ప్రశ్నించారు.

 

అయితే రాజకీయాల్లో జూనియర్ అయిన అప్పలరాజుకు చంద్రబాబు మీద విమర్శలు చేసే స్థాయి లేదని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.  నిక్కర్ వేసుకుని చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకున్న అప్పలరాజు, కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నారని, అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబుకు మానసిక వ్యాధి ఉందంటూ దారుణంగా మాట్లాడారని, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్పలరాజుకు స్థాయి మించి మాట్లాడటం తగదని కౌంటర్లు ఇస్తున్నారు.

 

ఇక నిమ్మగడ్డని తప్పించి ఎన్నికలని ఏకపక్షం చేసుకోవాలనే ఆత్రం వైసీపీకి ఎందుకని, రాజకీయాల్లో జూనియర్ అయినా అప్పలరాజుకు అంత ఆత్రం దేనికో అని ప్రశ్నిస్తున్నారు. అప్పలరాజుకు చంద్రబాబు మీద విమర్శలు చేసేసి జగన్ దగ్గర మార్కులు కొట్టేయాలనే ఆత్రం బాగా ఉందని తమ్ముళ్ళు  సెటైర్లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: