ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ భయంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు.  ఇంట్లో ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు.. అందుకే లాక్ డౌన్ సడలించగానే ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయ్యారు.  ఈ నేపథ్యంలో తొలకరి వర్షాలు పడగానే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వజ్రాల వేట మొదలైంది. వర్షాలు కురుస్తూ ఉండటంతో తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి తదితర మండలాల్లో భూమి లోపలి నుంచి బయటకు వచ్చే వజ్రాలు, రంగురాళ్ల కోసం ప్రజలు పెద్దఎత్తున వేట ప్రారంభించారు. గుంతకల్, ద్రోణాచలం ప్రాంతాల్లో మకాం వేసి, అక్కడి నుంచి వజ్రాలు దొరుకుతాయన్న భూముల్లోకి వెళ్లి, రోజంతా వెతుకున్న వారి సంఖ్య గత రెండు రోజుల్లో భారీగా పెరిగిపోయింది.

 

రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగా వజ్రాల వేట ప్రారంభించారు.ఈ సంవత్సరం కరోనా, లాక్ డౌన్ కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. స్థానికులు మాత్రం పిల్లా పాపలతో సహా పెద్దఎత్తున వజ్రాల కోసం వెతుకుతూ, తమను అదృష్టం వరించాలని కోరుకుంటున్నారు.  ఇక అత్యంత విలువైన వజ్రాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

ఇక వజ్రాల వ్యాపారులు ఇలా బహిరంగంగా వజ్రాలను కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే అంటున్నారు.  ఇక, ఇక్కడి వారికి దొరికే వజ్రాలను కొనుగోలు చేసేందుకు ముంబయి, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి వచ్చే మధ్యవర్తులు సైతం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కరువు కాలంలో ఒక్కవజ్రం దొరికినా మహా అదృష్టమే అంటున్నారు అక్కడి ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: