కరోనా వైరస్‌ మానవాళికి పెద్ద సవాల్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది దీని బారిన పడగా, కొత్త కేసులు అంతకంతకు పెరిగిపోతుండడం టెన్షన్‌ పెడుతోంది. అయితే, పలు దేశాలు ఆంక్షలు సడలిస్తుంటే... ఇంకొన్ని మరో సారి లాక్‌డౌన్‌ విధించేందుకు సిద్ధమవుతున్నాయి. 

 

కరోనాకు అడ్డూ-అదుపూ లేకుండా పోతోంది. ఈ వైరస్‌ను ఎలా కట్టడి చేయాలో, తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక ప్రపంచ దేశాలు జుట్టు పీక్కుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 62 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇందులో 79 వేల కేసులు గడిచిన 24 గంటల్లో నమోదైనవే. కరోనా మరణాలు కూడా అధికంగానే ఉన్నాయి. ఇంత వరకూ 3 లక్షల 70 వేల మందికి పైగా కరోనాతో చనిపోగా, గడిచిన 24 గంటల్లో 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

 

గడిచిన నెల రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. జనవరి 580 కేసులు నమోదైతే, ఆ నెలాఖరుకు అవి 11 వేల 950కి చేరాయి. ఫిబ్రవరి మాసాంతానికి 86 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్‌ 1కి 9 లక్షల 40 వేలు కాగా, ఆ నెలాఖరుకు 32 లక్షల 99 వేలకు చేరాయి కరోనా పాజిటీవ్‌ కేసలు. మే ఒకటి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 33 లక్షల 94 వేల కేసులు నమోదు కాగా, మే మాసాంతానికి 61 లక్షల 50 వేలకు చేరాయి కరోనా పాజిటీవ్‌ కేసులు.  


మరణాల విషయానికి వస్తే జనవరి 22 వరకూ17 మంది కరోనాతో చనిపోయారు. జనవరి 31 నాటికి అవి 259కి చేరాయి. ఫిబ్రవరి మాసాంతానికి 2 వేల 977 మంది వైరస్‌ బారిన పడి మరణించారు. మార్చి 31 నాటికి ప్రపంచ కరోనా మరణాలు 44 వేలు దాటాయి. ఏప్రిల్‌ 30 నాటికి 2 లక్షల 33 వేలకు చేరగా, మే 30 నాటికి ప్రపంచ కరోనా మరణాలు 3 లక్షల 70 వేలు దాటాయి. అంటే గత నెల రోజుల్లో దాదాపు లక్షన్నర మరణాలు సంభవించాయి. 

 

అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంటే... భారత్‌ ఏడోవ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 18 లక్షల 30 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇందులో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులే 12 వేలకు పైగా ఉన్నాయి. అలాగే, అక్కడ ఇంత వరకూ లక్ష మందికి కరోనాతో చనిపోగా, అందులో దాదాపు 400 మరణాలు గడిచిన 24 గంటల్లో సంభవించినవే. అమెరికా తర్వాత కరోనా ప్రభావం బ్రెజిల్‌లో అధికంగా ఉంది. అక్కడ 5 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా, అందులో 7 వేలకు పైగా కొత్త కేసులు. అలాగే, అక్కడ 29 వేల మందికి పైగా కరోనాతో చనిపోయారు. రష్యాతో పాటు భారత్‌లో  పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రష్యాలో గడిచిన 24 గంటల్లో 9 వేలకు పైగా కేసులు నమోదు కాగా, భారత్‌లో 8 వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. 

 

లాక్‌డౌన్‌ల వల్ల పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు గాడితప్పుతున్నాయి. కొన్ని దేశాల్లో చేయడానికి పని లేక... చేతిలో చిల్లిగవ్వ లేక జనం ఇబ్బందుడుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ తొలగించాలని ఆందోళనలకు దిగుతున్నారు. స్పెయిన్‌లో లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో జనం కార్లలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. 

 

అయితే... ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలించేది లేదని స్పష్టం చేశారు స్పెయిన్‌ ప్రధాని పెడ్రో స్నిజ్‌. మరో 15 రోజుల పాటు హెల్త్‌ ఎమర్జెన్సీ కొనసాగుతుందని, ఈ నెల 8 నుంచి ఆక్షల్ని సడలిస్తామంటోంది స్పెయిన్‌ ప్రభుత్వం. మరోవైపు... కరోనా మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని స్పెయిన్‌లో పది రోజులు సంతాప దినాలు పాటిస్తున్నారు. 


  
కొన్ని దేశాలు కరోనా ఆంక్షల్ని సడలిస్తున్నాయి. ధార్మిక కార్యక్రమాలకు కూడా అనుమతిస్తున్నాయి. ఇటలీలో దాదాపు 3 నెలల తర్వాత లాక్‌డౌన్‌ను సడలించారు. దీంతో వాటికన్‌ నగరం సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో  కిటికీలోంచి పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రజల్ని ఆశీర్వదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: