భారత్‌లో కరోనా గణాంకాలు కలవరపెడుతున్నాయి. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల సరసన మనం చేరిపోయాం. కేసుల పరంగా ఏడో స్థానంలో... మరణాల విషయంలో మనది 13వ స్థానం. రానున్న రోజుల్లో కరోనా మరింత ఉధృతంగా వ్యాపించే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయ్‌. 

 

దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. కొత్తగా 8 వేల 392 మంది వైరస్‌ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 90 వేల 535కి చేరింది. ఇక కొవిడ్‌ మరణాల సంఖ్య కూడా ప్రతిరోజూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో  230 మంది వైరస్‌తో  ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5 వేల 394 కి చేరింది. 91 వేల 819 మంది వైరస్‌ను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం 93 వేల 322 యాక్టివ్‌ కేసులున్నాయ్‌. పెరుగుతున్న కేసులతో భారత్‌ ప్రపంచంలోనే వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో 7వ స్థానానికి చేరింది. మరణాల్లో మాత్రం ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది.

 

కరోనా మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై అల్లాడిపోతోంది. భారత్‌లో సంభవించిన కొవిడ్‌ మరణాల్లో దాదాపు 40 శాతం మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయ్‌. రాష్ట్రంలో కొత్తగా 2 వేల 487 మందికి వైరస్‌ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 67 వేల 6 వందల 55కి చేరింది. 89 మంది కొత్తగా కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటివరకు వైరస్‌ సోకి మరణించిన వారి సంఖ్య 2 వేల 286 కి చేరింది. మహారాష్ట్రలో పోలీసులు వేల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2 వేల 500 మందికిపైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు.

 

మహారాష్ట్ర తర్వాత కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా తమిళనాడులో కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 11వందల 49  పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22 వేల 333కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 173 మంది చనిపోయారు. తమిళనాడు తర్వాత ‌ ఢిల్లీ, గుజరాత్‌ల్లో వైరస్‌ విజృంభిస్తోంది. ఢిల్లీలో కేసుల సంఖ్య 20 వేలకు చేరువైంది. గుజరాత్‌లో 16 వేల 7 వందలకు పైగా బాధితులున్నారు.

 

అభివృద్ధి చెందిన దేశాల్లో... మరీ ముఖ్యంగా వైద్యపరంగా మన కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న దేశాల్లో ఆరంభంలోనే తీవ్ర ప్రభావం చూపించింది కరోనా వైరస్‌. అయితే... మన దగ్గర ఆ పరిస్థితి ఉండదని అప్పట్లో కొందరు ఘంటాపథంగా చెప్పారు. కానీ... ఇప్పుడు మన వంతు కూడా రానే వచ్చింది. మాస్క్‌లు ధరించడం, ప్రభుత్వాలు జారీ చేసే గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ... వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఇప్పుడు అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: