ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. జ‌గ‌న్ స‌డెన్‌గా ఈ టూరు పెట్టుకోవ‌డం వెనుక లెక్కేంట‌ని ప‌లువురు చ‌ర్చిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు వెల్ల‌డించారు. ముఖ్యమంత్రి మంగ‌ళ‌వారం ఢిల్లీ వెళ్తున్నారని తెలిపిన ఆయన సీఎంతోపాటు అధికారులు, తామందరం కూడా వెళ్తామ‌న్నారు. హోంమంత్రి అమిత్‌షాతో పాటుగా జలశక్తి మంత్రిని కలుస్తారని, అవకాశాన్ని బట్టి గనుల శాఖ మంత్రిని క‌లువ‌నున్నారని వెల్ల‌డించారు. పోలవరం నిధులు రావాల్సి ఉన్నాయని పేర్కొన్న విజ‌య‌సాయిరెడ్డి ఈ విష‌యమై ప్ర‌ధానంగా చ‌ర్చిస్తార‌ని అన్నారు. ఆర్ అండ్ ఆర్ లో వేలకోట్ల రూపాయలు రావాల్సి ఉందని, దీంతో పాటుగా వివిధ ప్రాజెక్ట్ లు వాటి ప్రోగ్రెస్  గురించి చర్చించేందుకు వెళ్తున్నారని తెలిపారు.


నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం నిజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ``రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వంపై విషం కక్కకూడదు.ఆయన ఏం చెప్పాడో అనే విషయం మీ అందరికి తెలుసు. ఎస్ఈసి విషయంలో  కోర్టు జడ్జిమెంట్‌‌ను క్షుణ్ణంగా చదివి అడ్వకేట్ జనరల్ మీడియాకు కూడా వివ‌రించారు. ఆయ‌న స‌రైన అంశాల‌ను హైలెట్ చేయడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్ లో ఇచ్చిన సారాంశాన్ని పరిశీలించినట్లైతే, గతంలో చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్‌ను అపాయింట్ చేశారో ఆ విధానాన్ని కూడా కోర్టు జడ్జిమెంట్ లో తప్పు పట్టడం జరిగింది. దానిపైన మేం సుప్రీంకోర్టును అప్రోచ్ కావడం జరుగుతోంది.`` అని తెలిపారు. 

 

 

అధికార పార్టీని ఫ్యాక్షనిస్టులు, గూండాలు అని పేర్కొంటూ నిమ్మ‌గ‌డ్డ‌ కేంద్రానికి ఉత్తరం రాసిన విషయం  అందరికి తెలుస‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ``నిమ్మ‌గ‌డ్డ‌ లెటర్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేయబడింది. అక్కడ ఉన్న సంతకానికి మిగిలిన ఆయన సంతకాలకు  టాలీ కావడం లేదని నేను డిజిపికి ఫిర్యాదు ఇవ్వడం, ఆయన సిఐడికి పంపించడం జరిగింది. ఆ విషయంలో నిమ్మగడ్డ రమేష్ ఒక క్రిమినాలిటికి పాల్పడ్డారనే అంశంలో సందేహం లేదు.నిమ్మగడ్డ రమేష్ గారు....మీరు ఆ పదవిలో ప్రజాస్వామ్య రక్షకులుగా ఉంటున్నారా లేకపోతే ప్రజాస్వామ్య హంతకులు కాబోతున్నారా? ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గిస్తే నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెళ్లాడంటే దాంట్లో ఓ అర్ధం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా నిమ్మగడ్డ రమేషే ఎన్నికల కమీషనర్ గా ఉండాలని  ఎందుకు కోర్టుకు వెళ్లింది.ఇందులో రాజకీయపార్టీగా ఆ పార్టీ ఆసక్తి ఏంటి. ఎవరుంటే టిడిపికి ఏంటి.ఆ పదవిలో నిమ్మగడ్డ రమేష్ ఉండచ్చు లేదా ఎక్స్ అనే వ్యక్తి ఉండచ్చు. చంద్రబాబునాయుడు కుట్రపూరితబుధ్దితో వ్యూహాత్మకంగా వ్యవహరించాడని చెప్పవచ్చు.`` అని అన్నారు. కాగా, సీఎం జగ‌న్ ఏపీ టూర్‌పై విజ‌య‌సాయిరెడ్డి ఇచ్చిన క్లారిటీతో వివిధ వ‌ర్గాల ప్ర‌చారానికి చెక్ పెట్టిన‌ట్ల‌యింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: